ఒడిశా రైలు ప్రమాద ఘటనలో అమానుషం.. శవాల ట్రక్కులో ప్రాణాలతో ఉన్న వ్యక్తి

by Disha Web Desk 9 |
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో అమానుషం.. శవాల ట్రక్కులో ప్రాణాలతో ఉన్న వ్యక్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాద బాధిత కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది. ఎన్నో ఆశలతో రైలెక్కిన ప్రయాణికుల బతుకులు పట్టాలపైన చిద్రమైన తీరు అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. ఇప్పటికీ తమ వారిని చివరి చూపు కోసం వందలాది మంది ఆసుపత్రుల ముందు క్యూ కట్టిన పరిస్థితుల్లో ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను తరలిస్తుండగా అందులో నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన తీరు సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిశ్వజిత్ మాలిక్.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు.

ఈ రైలు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఎలాగోల తన శక్తినంతా కూడదీసుకుని రైలు నుండి బయటకు వచ్చి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. గాయాల కారణంగా ఒంట్లో శక్తి లేక మెల్లిగా కళ్లు మూతపడ్డాయి. పైకి చేద్దామని ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో అలాగే అచేతనంగా పడిపోయాడు. కదలలేని స్థితిలో పడి ఉన్న బిశ్వజిత్ ను చనిపోయాడని భావించిన సహాయక సిబ్బంది అతడిని మృతదేహాలు తరలించే లారీలోకి ఎక్కించారు. కొద్దిసేపటి తర్వాత అతని సెల్‌ఫోన్ మోగడంతో మెలుకువ వచ్చి చూడగా షాక్ తిన్న భిశ్వజిత్.. తనను మిగతా శవాలతో పాటు తరలిస్తున్నారని గ్రహించాడు.

వెంటనే తాను బతికే ఉన్నానంటూ సిబ్బందికి తెలిసేలా చేయి పైకెత్తి చూపించాడు. ఇది గమనించిన సిబ్బంది హుటాహుటిన అతడిని అక్కడి నుంచి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కోల్ కతాలోని మరో ఆసుపత్రికి తరలించారు. కొద్ది నిమిషాలు అటు ఇటు అయినా తను ప్రాణాలతో ఉండేవాడిని కాదని భగవంతుడి దయతోనే తాను ప్రాణాలతో బయటపడగలిగానని బిశ్వజిత్ చెప్పుకొచ్చాడు.

Read more: ఒడిశా రైలు ప్రమాదంపై రంగంలోకి సీబీఐ.. ఏజెన్సీ ఎంట్రీతో తీవ్ర ఉత్కంఠ!

Next Story

Most Viewed