యాంటీ సనాతన్ మాత్రమే కాదు.. యాంటీ సంతాన్ కూడా.. కాంగ్రెస్ పై కేంద్రమంత్రి విసుర్లు

by Dishanational6 |
యాంటీ సనాతన్ మాత్రమే కాదు.. యాంటీ సంతాన్ కూడా.. కాంగ్రెస్ పై కేంద్రమంత్రి విసుర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. చనిపోయిన తర్వాత కూడా ప్రజలపై పన్ను విధించాలనేది కాంగ్రెస్ రహస్య ప్రణాళిక అని ఫైర్ అయ్యారు. ఎట్టకేలకు రహస్యం బయదటకు వచ్చిందని నమ్ముతున్నానని అన్నారు అనురాగ్ ఠాకూర్. కాంగ్రెస్ యాంటీ సనాతన్ మాత్రమే కాదు.. యాంటీ సంతాన్ కూడా అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలను సనాతన్ వ్యతిరేకులు అనుకున్నామని.. ఇప్పుడు వారు సంతాన్ వ్యతిరేకులు కూడా అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ 'హిడెన్ ఎజెండా' బయటపడిపోయిందని ఆయన అన్నారు. చనిపోయిన తర్వాత కూడా దోపిడీని కొనసాగిస్తూనే ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మరణానంతరం వారి ఆస్తులు పిల్లలకు చెందవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పిల్లలు సురక్షితంగా ఉన్నారా? అని ప్రజలను ప్రశ్నించారు అనురాగ్ ఠాకూర్.

శామ్‌ పిట్రోడా కామెంట్స్ ఏంటంటే..?

కాంగ్రెస్‌ నేత శామ్‌పిట్రోడా.. అమెరికాలోని ఓ విధానాన్ని ఉటంకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అమెరికాలో వారసత్వ పన్ను ఉందని కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని తెలిపారు. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని.. అదో ఇంట్రెస్టింగ్ విషయం అని పేర్కొన్నారు. అంటే ప్రజలు సంపదను సృష్టించి, వదిలివెళ్లిపోతున్నారని కామెంట్స్ చేశారు. ప్రజల కోసం సంపదను వదిలేయాలని... మొత్తం కాదు సగమే అని.. అది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా అన్నారు. దీంతో ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్మును లాక్కోవాలనుకుంటున్నారంటూ ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించాయి. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో అది ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.



Next Story

Most Viewed