అంతర్గత విషయాల్లో జోక్యం తగదు: జర్మనీ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ సీరియస్

by Dishanational2 |
అంతర్గత విషయాల్లో జోక్యం తగదు: జర్మనీ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. అంతర్గత విషయాల్లో కలుగ జేసుకోవడం ఏంటని ప్రశ్నించింది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. ‘భారత న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం అంటే మా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను బలహీనపర్చినట్టే. ఇలాంటి వ్యాఖ్యలు సరికావు’ అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. కాగా, జర్మన్ ఎంబసీ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎంజ్వీలర్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందిస్తూ..నిందితులందరిలాగే కేజ్రీవాల్ కూడా న్యాయమైన విచారణకు అర్హుడని తెలిపారు. ‘భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశం. అన్ని కేసుల మాదిరిగానే కేజ్రీవాల్ విషయంలోనూ పారదర్శక విచారణ జరగాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై భారత్ అభ్యంతరం తెలిపింది.

Next Story