Nagma: సొంత పార్టీలో నటి నగ్మాకు భంగపాటు..సోనియాపై ఫైర్

by Disha Web Desk 4 |
Nagma
X

దిశ, వెబ్‌డెస్క్: Nagma hits out at sonia gandhi on Being denied rajya sabha seat.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపి అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇంటి పోరు తప్పడం లేదు. తాజాగా రాజ్యసభ(Rajya Sabha) ఎన్నికలకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై సొంత నేతల నుండి వ్యతిరేకత వస్తోంది. ఇన్నాళ్లూ పార్టీ కోసం పని చేసిన తమను పక్కన పెట్టేసి సంబంధమే లేని వ్యక్తులను పెద్దల సభకు పంపాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడుతున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనకు అవకాశం కల్పించకపోవడంపై ఆ పార్టీ నాయకురాలు, నటి నగ్మా(Nagma) ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నగ్మా ప్రస్తుతం కాంగ్రెస్ లో ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ సారి కూడా టికెట్ దక్కకపోవడం పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2003-04లో తాను కాంగ్రెస్ లో చేరినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)నే తనను రాజ్యసభకు పంపుతానని హామీ ఇచ్చారని అన్నారు. మాట ఇచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తనకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. తాజా జాబితాలో మహారాష్ట్ర(Maharashtra) నుంచి ఇమ్రాన్ ను ఎంపిక చేయడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. తన 18 ఏళ్ల తపస్సులో ఏదో లోపం ఉండి ఉండవచ్చునని లేదా ఆ పదవికి తాను ఇమ్రాన్ కంటే తక్కువ అర్హురాలిని కావచ్చు అంటూ సెటైరికల్ పంచ్ వేశారు.

నగ్మాతో పాటు రాజ్యసభ సీటు ఆశించి భంగపాటుకు గురైన పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా(Pawan Khera) సైతం ట్విటర్‌ వేదికగా తన అసహనాన్ని వెళ్లగక్కారు. తన తపస్సులో ఏదైనా తగ్గి ఉంటుందేమో? అంటూ అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. వచ్చే నెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికలతో పెద్దల సభలో కాంగ్రెస్‌ బలం కాస్త పెరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్‌ సంఖ్యా బలం 29గా ఉంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉన్న విజయావకాశాలను పరిగణలోకి తీసుకుంటే పెద్దల సభలో కాంగ్రెస్‌ బలం 33కు పెరిగే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. పార్టీలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగాలని ఇటీవలే చింతన్ శిబిర్ నిర్వహించినా.. కాంగ్రెస్ లో రాజ్యసభ సీట్ల సర్దుబాటు వ్యవహారం కొత్త సమస్యలను తెచ్చిపెట్టినట్లైంది. భంగపాటుకు గురైన నేతలను ఎలా సముదాయిస్తారో చూడాలి మరి.



Next Story

Most Viewed