ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ గణేశమూర్తి మృతి.. విచారంలో పార్టీ

by Disha Web Desk 17 |
ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ గణేశమూర్తి మృతి.. విచారంలో పార్టీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని ఈరోడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎండీఎంకే పార్టీ ఎంపీ అవినాశ్ గణేశమూర్తి(76 ఏళ్లు) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ రాలేదని మనస్తాపానికి గురై ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికైన గణేశమూర్తి 1993 ఎండీఎంకే పార్టీ ఆవిర్భావం నుంచి దానిలో ఉన్నారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయిన ఎండీఎంకే పార్టీ నుంచి ఈరోడ్‌ ఎంపీగా గణేశమూర్తి గత ఎన్నికల్లో గెలుపొందగా, ఈ సారి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం నుంచి వైగో కుమారుడు దురైవైగోను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన మార్చి 24న ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 5.05 గంటల సమయంలో మరణించారు. ఆయన మృతిపై పార్టీ నాయకులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed