'మణిపూర్‌లో సంక్షోభాన్ని నివారించండి'.. అమిత్ షాకు 11 మంది అథ్లెట్ల లేఖ

by Disha Web Desk 13 |
మణిపూర్‌లో సంక్షోభాన్ని నివారించండి.. అమిత్ షాకు 11 మంది అథ్లెట్ల లేఖ
X

ఇంఫాల్: మణిపూర్‌లో ఎస్టీ రిజర్వేషన్లపై జరుగుతున్న అల్లర్లపై అంతర్జాతీయ అథ్లెట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లర్లకు దారితీసిన సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుతో సహా 11 మంది అంతర్జాతీయ అథ్లెట్లు మంగళవారం లేఖ రాశారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం చూపకుంటే, రాష్ట్రంలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొని రాకుంటే తమ పతకాలను, అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు.

8 డిమాండ్లతో రాసిన లేఖపై సంతకాలు చేసిన వారిలో పద్మ అవార్డు గ్రహీత, వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి, భారత మహిళా ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ బెమ్ బెమ్ దేవి, బాక్సర్ ఎల్. సరితా దేవి తదితరులు ఉన్నారు. కొన్ని వారాలుగా బ్లాక్ చేసిన జాతీయ రహదారి-2ను మళ్లీ తెరవాలని డిమాండ్ చేశారు. దీన్ని బ్లాక్ చేయడంతో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం..

నెల రోజుల క్రితం జాతి ఘర్షణలు మొదలైన మణిపూర్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఆ రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీబిజీగా చర్చలు జరుపుతున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తో, రాష్ట్ర మంత్రి వర్గంతో, వివిధ పార్టీలు, మహిళా సంఘాలు, గ్రూపులతో సమావేశాలు నిర్వహించారు. మరోవైపు.. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.

మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనుంది. కాగా.. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మణిపూర్ హింసాకాండపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు. ఎస్టీ కేటగిరీలో చేర్చాలని రాష్ట్రంలో మైతీ తెగవారు డిమాండ్ చేస్తున్నారు. కొండల్లో స్థిరపడిన కుకీ తెగల వారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య నెల రోజుల క్రితం హింసాకాండ చెలరేగింది. ఈ ఘర్షణల్లో 80 మందికి పైగా చనిపోయారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

Next Story

Most Viewed