కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలి.. దళిత నేతలను విస్మరించడం తగదు: మాయావతి

by Dishanational4 |
కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలి.. దళిత నేతలను విస్మరించడం తగదు: మాయావతి
X

దిశ, నేషనల్ బ్యూరో : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు, దళితుల గొంతుక కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నర్సింహారావు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానన్న మాయావతి.. ఈవిషయంలో దళిత నేతలను కేంద్రం విస్మరించడం తగదని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌‌కు మాజీ ప్రధాని వీపీ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయాన్ని ఆమె ఈసందర్భంగా గుర్తుచేశారు. కాన్షీరామ్ తొలుత ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌ను స్థాపించారు. ఇది దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పనిచేసేది. నిమ్న కులాలు, ఇతర అట్టడుగు వర్గాలను చేరుకోవడానికి దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి అనే ఉద్యమకార సమూహాన్ని కూడా కాన్షీరామ్ నడిపేవారు. కాన్షీరామ్ 2006 సంవత్సరంలో 72 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు.

Next Story

Most Viewed