ఉద్యోగులు బయటికి వెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. మరీ ఇంత దారుణమా..?

by Disha Web Desk 7 |
ఉద్యోగులు బయటికి వెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. మరీ ఇంత దారుణమా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : హరియాణాలో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. గురుగ్రామ్‌కు చెందిన కోడింగ్‌ నింజాస్‌ అనే ఎడ్‌టెక్‌ కంపెనీ చేసిన నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం ఆఫీసుకు తాళాలు వేయించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఉద్యోగులు ఆఫీసులో ఉండగా వాచ్‌మెన్‌ ఆఫీసు డోర్‌కు తాళాలు వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటని అడిగితే..‘అనుమతి లేకుండా ఏ ఉద్యోగిని బయటకు పంపించొద్దని మేనేజర్‌ చెప్పారు. బయటకు వెళ్లాలంటే పర్మిషన్‌ తెచ్చుకోండి’ అని వాచ్‌మెన్‌ అన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

‘కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగుల పరిస్థితి దిగజారిపోతుంది. మరీ ఇంత దారుణమా ?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారడంతో కోడింగ్‌ నింజాస్‌ కంపెనీ స్పందించింది. ‘మా కంపెనీకి చెందిన ఒక ఆఫీసులో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఓ ఉద్యోగి కారణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ కొద్ది క్షణాల్లోనే దాన్ని సరిదిద్దాం. సదరు ఉద్యోగి తన పొరబాటును అంగీకరించి క్షమాపణలు కూడా తెలియజేశారు. ఘటన నేపథ్యంలో ఉద్యోగులకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ వ్యవస్థాపకులు కూడా విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మేం చర్యలు తీసుకుంటున్నాం. సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నాం’ అని కంపెనీ స్పష్టం చేసింది.



Next Story

Most Viewed