Explained: ‘భారత రత్న’ ఎవరికిస్తారు? గ్రహీతలు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

by Dishanational5 |
Explained: ‘భారత రత్న’ ఎవరికిస్తారు? గ్రహీతలు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం శనివారం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించింది. బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు(మరణానంతరం) సైతం ఈ అవార్డును అందజేయనున్నట్టు ఇటీవలే వెల్లడించింది. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అసలు ‘భారత రత్న’ అవార్డును ఎవరికిస్తారు? ఎందుకిస్తారు? ఈ అవార్డు పొందినవారికి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? అనే ప్రశ్నలు సామాన్యుల్లో ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘భారత రత్న’ చరిత్ర

దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఆమోదించిన కేబినెట్ తీర్మానానికి అనుగుణంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1954 జనవరి 2 ‘భారత రత్న’ను స్థాపించారు. మొదట్లో ఈ అవార్డు కళలు, సాహిత్యం, సైన్స్, పబ్లిక్ సర్వీసెస్ రంగాలకే పరిమితమై ఉండేది. కానీ, 2011లో ఈ అవార్డు అందజేసే రంగాల పరిధిని విస్తరించారు. మానవాభివృద్ధికి తోడ్పడే ఏ రంగంలోని అర్హులకైనా ‘భారత రత్న’ను అందజేయాలని నిర్ణయించారు.

డిజైన్ చేసింది ఎవరు?

భారత రత్న పురస్కారాన్ని ప్రముఖ కళాకారుడు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత నందాలాల్ బోస్ డిజైన్ చేశారు. కాంస్యంతో తయారుచేసే ఈ అవార్డు.. రావి ఆకు ఆకారంలో ఉంటుంది. దీనికి ఒకవైపు సూర్యడి చిత్రం, దానికింద దేవనగరి లిపిలో ‘భారత రత్న’ అని రాసి ఉంటుంది. మరోవైపు, ‘జాతీయ చిహ్నం’ ఉండి, దానికింద ‘సత్యమేవ జయతే’ అనే నినాదం చెక్కి ఉంటుంది. అవార్డును మెడలో ధరించడానికి వీలుగా తెల్లటి రిబ్బన్‌ను ఉపయోగిస్తారు.

ఎవరు అర్హులు? అనర్హులెవరు?

భారత రత్న అవార్డు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. ఏదేని రంగంలో సమాజానికి ఉపయోగపడేలా అసాధారణమైన సేవ లేదా పనితీరు కనబర్చినవారికి ఈ పురస్కారం అందజేస్తారు. వ్యక్తిగత విజయాలు, కృషితో దేశం గర్వించేలా చేసినవారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో గౌరవిస్తారు. ఇంకా చెప్పాలంటే, జాతి, వృత్తి, స్థానం లింగంతో సంబంధం లేకుండా ‘అసాధారణమైన సేవ’ లేదా ‘అత్యున్నత స్థాయిలో పనితీరు’ కనబర్చినవారిని ‘భారతరత్న’ వరిస్తుంది. జాతీయతతో సంబంధం లేకుండా, కళ, సాహిత్యం, సైన్స్, ప్రజాసేవ, శాంతి, మానవ సంక్షేమానికి ‘‘విశిష్టమైన కృషి’’ చేసినవారు ‘భారత రత్న’కు అర్హులు. అవార్డుకు సిఫార్సు చేసిన ఐదేళ్లలోపు సదరు వ్యక్తి మరణిస్తే మరణానంతరం కూడా అవార్డు ఇవ్వొచ్చు. అయితే, నేరారోపణ, లేదా నైతిక విఘాతానికి పాల్పడినవారు ఈ అవార్డు అందుకోవడానికి అనర్హులు.

అవార్డు గ్రహీతలకు అందే ప్రయోజనాలు

నిజానికి, ‘భారత రత్న’ అవార్డు రావడమే తమ జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తారు. అయితే, ఆ గౌరవంతోపాటు అవార్డు గ్రహీతలకు అదనంగా పలు ప్రయోజనాలు సైతం దక్కుతాయి. భారత రత్న అవార్డు గ్రహీతలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) వేతనానికి సమానంగా తమ జీవితకాలం పెన్షన్ పొందుతారు. ఎయిర్ ఇండియా దేశీయ విమాన టిక్కెట్లపై రాయితీ లభిస్తుంది. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లలో బోర్డింగ్ సమయంలో ప్రాధాన్యత ఇస్తారు. సీఆర్పీఎఫ్ నుంచి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. భారత రత్న గ్రహీత దేశంలోనే మరణిస్తే, వారి అంత్యక్రియలు సైనిక గౌరవాలతో ప్రభుత్వమే నిర్వహిస్తుంది.


Next Story

Most Viewed