లోక్‌సభ బరిలో ఖలిస్థాన్ వేర్పాటువాది..జైలు నుంచే పోటీ చేయనున్న అమృత్‌పాల్!

by Dishanational2 |
లోక్‌సభ బరిలో ఖలిస్థాన్ వేర్పాటువాది..జైలు నుంచే పోటీ చేయనున్న అమృత్‌పాల్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగడ్ జైలులో ఉన్న ఆయన జైలు నుంచే పోటీ చేస్తారని అమృత్ పాల్ తరఫు న్యాయవాది రాజ్ దేవ్ సింగ్ ఖల్సా తెలిపారు. అమృత్ పాల్‌ను బుధవారం జైలులో కలిసినప్పుడు ఈ విషయం తనతో చెప్పాడని వెల్లడించారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వత్రంత్య అభ్యర్థిగా బరిలో నిలుస్తారని చెప్పారు. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌లో జూన్ 1న పోలింగ్ జరగనుంది.

దీనిపై అమృత్ పాల్ సింగ్ తండ్రి టార్సెమ్ సింగ్ స్పందించారు. అమృత్ పాల్‌ను చాలా కాలంగా కలవలేదని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తనకు తెలియదని, అమృత్ పాల్‌ను కలిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా, గతేడాది అమృత్ పాల్ సింగ్, అతని మద్దతు దారులు కత్తులు, తుపాకులతో అమృత్‌సర్ నగర శివార్లలోని పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. వారి సహచరుడు లవ్ ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చాలా రోజులు గాలింపు చర్యలు చేపట్టి 2023 ఏప్రిల్ 23వ తేదీన అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన అసోం జైలులోనే ఉన్నారు.



Next Story

Most Viewed