ఈవీఎంలపై ఈసీ మౌనం ఆందోళనకరం : కాంగ్రెస్

by Dishanational4 |
ఈవీఎంలపై ఈసీ మౌనం ఆందోళనకరం : కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) స్లిప్పులపై ఇండియా కూటమి లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమాధానం ఇవ్వలేకపోతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్) జైరాం రమేష్ అన్నారు. దీనిపై చర్చించేందుకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం ఆందోళన రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై ఇండియా కూటమి నేతలతో ఎన్నికల సంఘం చర్చించకూడదనే కోర్టు ఉత్తర్వులేం లేవు కదా అని ఆయన ప్రశ్నించారు. జనవరి 7న ఈసీకి రాసిన లేఖలో ఈవివరాలను జైరాం రమేష్ ప్రస్తావించారు.

వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంలను..

వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంలను నూటికి నూరు శాతం సరిపోల్చాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులను ఓటర్లకు తప్పకుండా అందజేయాలని, ఓటర్లు ఆ స్లిప్పును చూసుకున్నాక ప్రత్యేక పెట్టెలో వేసే అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. ఇలాంటి అంశాలపై తాము సందేహాలను అడిగినప్పుడల్లా.. ‘తరుచుగా అడిగిన ప్రశ్నలు (FAQ) చూసుకోండి’ అంటూ నిర్లక్ష్యపూరితంగా పడికట్టు సమాధానాన్ని ఎన్నికల సంఘం రిపీట్ చేస్తోందని జైరాం రమేష్ విమర్శించారు. రెండు డజన్లకుపైగా పార్టీలకు ప్రాతినిధ్యం వహించే ఇండియా కూటమికి అర్ధవంతమైన సమాధానం ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వైపు నుంచి చిన్న ప్రయత్నం కూడా జరగడం లేదని ఆరోపించారు.



Next Story