నిర్మల అండ్ టీమ్.. మనదేశ బడ్జెట్‌కు రూపకర్తలు వీరే

by Dishanational4 |
నిర్మల అండ్ టీమ్.. మనదేశ బడ్జెట్‌కు రూపకర్తలు వీరే
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌‌పై దేశమంతటా చర్చ జరుగుతోంది. అందులోని కీలక ప్రకటనలపై డిస్కషన్ నడుస్తోంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ తయారీ టీమ్‌లోని కీలక సభ్యులలో రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, టీవీ సోమనాథన్, ఆర్థికశాఖ కార్యదర్శి, వి.అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు ఉన్నారు. వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

టీవీ సోమనాథన్

టీవీ సోమనాథన్ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి. ఆయన కేంద్ర వ్యయ విభాగం కార్యదర్శి కూడా. తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సోమనాథన్.. 2015 ఏప్రిల్ నుంచి 2017 ఆగస్టు వరకు ప్రధాని మోడీ కార్యాలయంలో పనిచేశారు. ప్రధానికి సన్నిహితులుగా పేరొందారు. బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక మంత్రి నిర్మలకు మార్గనిర్దేశనం చేసింది ఈయనే. ఆత్మనిర్భర్ భారత్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో సోమనాథన్ కీలక పాత్ర పోషించారు.

వి.అనంత నాగేశ్వరన్

వి.అనంత నాగేశ్వరన్ భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుడు. ఈ సంవత్సరం మినీ ఎకనామిక్ సర్వేను సంకలనం చేసింది ఈయనే. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలపై ఆర్థికమంత్రి సీతారామన్‌కు సలహాలు ఇచ్చిన వారిలో అనంత నాగేశ్వరన్ ఒకరు. జీ20 ప్రెసిడెన్సీ సమయంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కేంద్ర ఆర్థికశాఖ టీంలో నాగేశ్వరన్ కూడా ఉన్నారు.

అజయ్ సేథ్

అజయ్ సేథ్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం ఆర్థిక శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇండియా అధ్యక్షతన ఏర్పాటైన జీ20 దేశాల ఆర్థిక మంత్రుల టీమ్‌కు అజయ్ ఇన్‌ఛార్జ్ అధికారిగా వ్యవహరించారు. భారతదేశం యొక్క మొట్టమొదటి సావరిన్ గ్రీన్ బాండ్ జారీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ఏర్పాటు వంటి కార్యక్రమాలకు ఆయనే నాయకత్వం వహించారు.

సంజయ్ మల్హోత్రా

సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ అధికారి. ఈయన ప్రస్తుతం రెవెన్యూ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పన్ను రాబడి పెరుగుదలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించారు. ఈవిషయంలో కేంద్ర ఆర్థికమంత్రికి సలహాలు ఇచ్చారు. సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్ బీని ఈయనే రెడీ చేశారు.

తుహిన్ కాంత పాండే

ప్రభుత్వ పెట్టుబడి వ్యూహాలతో ముడిపడిన నిర్ణయాలను తీసుకోవడంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలకు సలహాలు ఇచ్చింది తుహిన్ కాంత పాండేనే. గతంలో ఎయిరిండియా కేంద్రం పరిధిలో ఉండగా.. దాన్ని టాటాలకు విక్రయించే లావాదేవీల వ్యవహారంలోనూ ఈయన ప్రభుత్వం తరఫున కీలక పాత్ర పోషించారు. జాతీయ బీమా సంస్థ ఎల్‌ఐసీని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయడంలోనూ తుహిన్ కాంత పాండేది ముఖ్యమైన పాత్రే.

వివేక్ జోషి

ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన విధి విధానాలు, పథకాలు, చట్టాలతో ముడిపడిన మార్గదర్శకాలతో ముడిపడిన అంశాలు వివేక్ జోషి పరిధిలో ఉండేవి. ఈ అంశాల్లో ఎలాంటి సంస్కరణలు చేయాలనే దానిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలకు వివేక్ జోషి సూచనలు ఇచ్చారు. ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డు సభ్యుడు. కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా నియమించబడక ముందు.. రిజిస్ట్రార్ జనరల్, భారత జనాభా లెక్కల కమిషనర్‌ వంటి కీలక పదవులను వివేక్ నిర్వర్తించారు. జాతీయ పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలోనూ ఈయన పాత్ర కీలకమైంది.



Next Story

Most Viewed