‘రఫా’ నుంచి వెళ్లిపోండి..మరోసారి ఆదేశించిన ఇజ్రాయెల్

by samatah |
‘రఫా’ నుంచి వెళ్లిపోండి..మరోసారి ఆదేశించిన ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయొద్దని అమెరికా ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా రఫాలోని మరిన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని పాలస్తీనియన్లను ఆదేశించింది. ఎన్‌క్లేవ్‌లోని 11, ఇతర పరిసరాలను ఖాళీ చేసి సురక్షిత మైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ మేరకు శనివారం ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. స్థానభ్రంశం చెందిన గాజా నగరానికి పశ్చిమాన ఉన్న ఆశ్రయాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రమాదకరమైన పోరాట ప్రాంతంలో ఉన్నారని హెచ్చరించారు. ఇక్కడ భారీ దాడి జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

కాగా, రఫాపై దాడి చేయొద్దని, అలా చేస్తే ఆయుధాల సరఫరా నిలిపి వేస్తామని యూఎస్ హెచ్చరించిన నేపథ్యంలోనే తాజాగా ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు రఫా నుంచి వెళ్లి పోయినట్టు తెలుస్తోంది. హమాస్ ఉద్యమానికి చెందిన వేలాది మంది మిలిటెంట్లను నిర్మూలించకుండా యుద్ధంలో విజయం సాధించలేమని ఇజ్రాయెల్ చెబుతోంది. రఫాలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్టు ఆరోపిస్తోంది. అందుకే రఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. అయితే రఫా నగరంపై దాడి చేస్తే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి.

Next Story

Most Viewed