26 రాఫెల్ యుద్ధ విమానాలు.. ఫ్రాన్స్ పర్యటనలో డీల్‌!

by Disha Web Desk 13 |
26 రాఫెల్ యుద్ధ విమానాలు.. ఫ్రాన్స్ పర్యటనలో డీల్‌!
X

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు స్కార్పెన్ క్లాస్ సాంప్రదాయ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను రక్షణ దళాలు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ముందు ఉంచాయని, ప్రధాని మోడీ ఈ వారంలో జరిపే ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఈ డీల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం.. భారత నావికా దళానికి 22 సింగిల్ సీట్ రాఫెల్ మెరైన్ విమానాలతో పాటు నాలుగు ట్రైనర్ విమానాలు లభిస్తాయి. ఈ డీల్ విలువ రూ.90 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే.. తుది ఒప్పందం తర్వాతే ఖర్చు వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.

ఈ ఒప్పందంలో భారత్ ధరల రాయితీ కోరే అవకాశం ఉంది. గతంలో 36 రాఫెల్ యుద్ధ విమానాల సమయంలో కుదుర్చుకున్నట్లే ఈ రాఫెల్ డీల్‌కు కూడా భారత్, ఫ్రాన్స్ సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అత్యున్నత సమావేశాల్లో చర్చించిన ఈ ప్రతిపాదనలు కొన్ని రోజుల్లో రక్షణ కొనుగోలు మండలి ముందు ఉంచుతారు. అయితే.. ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ ప్రకటించే ముందు భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

స్కార్పెన్ క్లాస్ సబ్‌మెరైన్ల నిర్మాణం..

సరిహద్దుల్లో భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న భారత్‌కు యుద్ధ విమానాలు, జలాంతర్గాముల కొరత కూడా వేధిస్తోంది. దీంతో వీటిని అత్యవసరంగా కొనుగోలు చేయాలని నావికా దళం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్ మిగ్-29లను నడుపుతున్నాయి. ఈ రెండు వాహకాలపై కార్యకలాపాలకు రాఫెల్‌లు అవసరం. ప్రాజెక్ట్ 75లో భాగంగా నేవీ రిపీట్ నిబంధన కింద మూడు స్కార్పెన్ క్లాస్ సబ్‌మెరైన్‌లను కొనుగోలు చేయాల్సి ఉంది. వీటిని ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ముంబైలోని మజాగాన్ డాక్ యార్డ్స్ లిమిటెడ్‌లో నిర్మిస్తారు.

Next Story

Most Viewed