భారత్ ఆ విషయంలో చాలా బెటర్: విదేశాంగ మంత్రి జైశంకర్

by samatah |
భారత్ ఆ విషయంలో చాలా బెటర్: విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ నేడు చాలా మారిపోయిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే స్థితిలో దేశం ఉందన్నారు. ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా జైశంకర్ ప్రసంగించారు. జాతీయ ప్రయోజనాలపై దృఢంగా నిలబడే సామర్థ్యం భారత్ సొంతమని కొనియాడారు. ఇంధన ఎంపికల విషయంలో వినియోగదారుల ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడిందని చెప్పారు. భవిష్యత్‌లోనూ వారి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని నొక్కి చెప్పారు. అందుకే భారత్ ప్రస్తుతం భిన్నమైన దేశం..విదేశాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణంగా ఉంది అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం దూసుకుపోతుందన్నారు.

ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ వివాదాలపై స్పందించిన జైశంకర్..ప్రపంచం నేడు సవాళ్లతో కూడుకుని ఉందన్నారు. ఎర్ర సముద్రంలో పరిస్థితులతో మరింత ఆందోళన పెరిగిందని తెలిపారు. ‘భారత్ గ్లోబల్ మార్కెట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. తయారీ, సాంకేతిక పురోగమనాలను ఉపయోగించుకుంటుంది’ అని తెలిపారు. కొవిడ్-19 సవాల్లను భారత్ ఎలా ఎదుర్కుందో ప్రపంచంమంతా చూసిందని గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితిని దీటుగా ఎదుర్కోవడంతో పాటు 100 దేశాలకు వ్యాక్సిన్‌లు అందజేశామని చెప్పారు. నా తర్వాత వచ్చే వారు కూడా ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత ప్రభావవంతంగా, మరింత గొప్ప ఆలోచనలతో విదేశాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలరని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story