బార్డర్‌లో ఆల్ ఈజ్ వెల్.. చైనా రక్షణ మంత్రి వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
బార్డర్‌లో ఆల్ ఈజ్ వెల్.. చైనా రక్షణ మంత్రి వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఇండియా-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఇచ్చిన బలమైన సందేశంపై చైనా స్పందించింది. గల్వాన్ ఘటన నేపథ్యంలో గురువారం జరిగిన ఇరుదేశాల రక్షణమంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ చేసిన ప్రకటనపై చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫూ తాజాగా రియాక్ట్ అయ్యారు. అంతర్జాతీయ సరిహద్దులో విభేదాలను భూతద్దంలో చూడొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

"బార్డర్‌లో అంతా బాగానే ఉంది. చైనా-ఇండియాలు సమగ్ర దీర్ఘకాలిక దృక్పథాన్ని తీసుకోవాలి. రెండు దేశాల మధ్య విబేధాల కంటే ఉమ్మడి ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు సమస్యను తగిన స్థానంలో ఉంచాలి. సరిహద్దు పరిస్థితిని సాధారణీకరించే నిర్వహణకు ప్రోత్సహించాలి. తద్వారా ప్రపంచానికి వివేకం, బలాన్ని సంయుక్తంగా అందించాలి. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం. అందుకు సహకరించండి" అని చైనా పేర్కొంది.

అయితే 2023 ఫిబ్రవరి 22న జరిగిన చైనా-భారత్ సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం వర్కింగ్ మెకానిజం సమావేశం అనంతరం చైనా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌కు విరుద్ధంగా డ్రాగన్ ప్రస్తుత డిమాండ్‌ ఉంది. ఈ కారణం వల్లే చైనా ప్రకటన భారత్‌కు ఆమోదయోగ్యం కాదు. సరిహద్దు పరిస్థితి రెండు దేశాల మధ్య బంధాల విస్తరణతో ముడిపడి ఉందని భారత్‌ వాదిస్తోంది. చైనా ఆర్మీ చార్డింగ్ నింగ్లుంగ్ నుల్లా సెక్టర్ సహా దెమ్‌చోక్ ఏరియా, దౌలత్‌బేగ్ ఓల్డీ సెక్టర్‌లోని డెప్సాంగ్ ప్లెయిన్స్ వద్ద ఘర్షణ పరిస్థితులను నివారించాలని కోరుతోంది. తూర్పు లడఖ్‌లోని సరిహద్దుల్లో ప్రస్తుతం ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితిని పీఎల్ఏ సాధారణ స్థితికి తీసుకురావాలని చైనాను డిమాండ్ చేస్తోంది.

ఉగ్రవాదాన్ని అంతం చేద్దాం : రాజ్ నాథ్

మరోవైపు అత్యంత కీలకమైన షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశం శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగింది. ఇందులోనూ భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఉగ్రవాదులకు ఏదైనా దేశం ఆశ్రయం కల్పిస్తే.. అది ఇతర దేశాలతో పాటు ఆశ్రయం కల్పించే వాళ్లకూ ముప్పును తెస్తుందని పరోక్షంగా పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌లో పాకిస్తాన్ రక్షణ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు.



Next Story

Most Viewed