ఇండియా కూటమిపై మోడీ ఫైర్

by Dishanational1 |
ఇండియా కూటమిపై మోడీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలకు దిగేలా చేస్తున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులు ఉన్నత పదవులను పొందడాన్ని ప్రతిపక్ష నాయకులు సహించలేకపోతున్నారన్నారు. శుక్రవారం సంత్ రవిదాస్ 647వ జయంతిని పురస్కరించుకుని సొంత వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, 'ప్రతి యుగంలో సాధువుల ఉపన్యాసాలు మనకు మార్గాన్ని చూపుతాయి. మనల్ని అప్రమత్తం చేస్తాయి. మన దేశంలో ఎవరైనా కులం పేరుతో వివక్షకు పాల్పడితే అది మానవత్వాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి దేశంలోని ప్రతి దళితుడు, వెనుకబడిన ప్రతి ఒక్కరూ, కులం పేరుతో రెచ్చగొట్టాలని చూస్తున్న, దళితుల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలను వ్యతిరేకించే 'ఇండి ఘట్‌బంధన్'ను గమనించాలి. కులాల సంక్షేమం పేరుతో వారు కుటుంబ ప్రయోజనాల రాజకీయాలకు పాల్పడుతున్నారన్న నిజం తెలుసుకోవాలని మోడీ అన్నారు.

రాహుల్ గాంధీపై ఆగ్రహం..

ఇదే సమయంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం తాగి రోడ్లపై పడున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోడీ విరుచుకుపడ్డారు. మతిస్థిమితం కోల్పోయిన వారే వారణాసిలోని పిల్లలను తాగుబోతులంటారు. 'కాంగ్రెస్ యువరాజు వారణాసి ప్రజలను వారి సొంత గడ్డపైనే అవమానించారు. రెండు దశాబ్దాలుగా మోడీని ద్వేసిస్తూ ఉన్నారు. ఇప్పుడు యూపీ యువతపై తమ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. యూపీ యువతను ఇండియా కూటమి అవమానించిన తీరును ఎన్నడూ మర్చిపోనని, కాశీ, అయోధ్యలో జరుగుతున్న మార్పులను ఇండియా కూటమి సహించలేకపోతోందని ' ఆరోపించారు.

అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన..

సొంత నియోజకవర్గ పర్యటనలో ప్రధాని మోడీ రూ. 13,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. అధికారిక వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టుల్లో రోడ్లు, వంటగ్యాస్ బాట్లింగ్ ప్లాంట్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, నేత కార్మికుల కోసం సిల్క్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఉన్నాయి. అలాగే, వారణాసిలో టెక్స్‌టైల్స్ రంగం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)కి మోడీ శంకుస్థాపన చేశారు. బనారస్ హిందూ యూనివర్శిటీలో కొత్త మెడికల్ కాలేజీ, నేషనల్ సెంటర్ ఆఫ్ ఏజింగ్‌కు పునాది వేశారు. సిగ్రా స్పోర్ట్స్ స్టేడియం ఫేజ్-1, డిస్ట్రిక్ట్ రైఫిల్ షూటింగ్ రేంజ్‌ను ప్రారంభించారు. సంత్ రవిదాస్ జన్మస్థలి చుట్టూ సుమారు రూ. 32 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. సంత్ రవిదాస్ మ్యూజియంకు శంకుస్థాపన చేశారు.


Next Story