2030 నాటికి 'శిథిలాల రహిత అంతరిక్ష మిషన్‌' భారత్ లక్ష్యం: ఇస్రో ఛైర్మన్

by Dishanational1 |
2030 నాటికి శిథిలాల రహిత అంతరిక్ష మిషన్‌ భారత్ లక్ష్యం: ఇస్రో ఛైర్మన్
X

దిశ, నేషనల్ బ్యూరో: 2030 నాటికి శిథిలాల రహిత అంతరిక్ష మిషన్‌(డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్)ను సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. మంగళవారం జరిగిన 42వ ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ(ఐఏడీ) వార్షిక సమావేశంలో ప్రసంగించిన సోమనాథ్.. రానున్న రోజుల్లో అంతరిక్ష పరిశోధన, వినియోగానికి సంబంధించి ఇస్రో చాలా స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. అంతరిక్ష స్థిరత్వాన్ని కాపాడేందుకు శిథిలాల రహిత అంతరిక్ష మిషన్‌లను నిర్వహించేందుకు భారత్ చొరవ తీసుకుంటుంది. ప్రస్తుతం కక్ష్యలో 54 అంతరిక్ష నౌకలను కలిగి ఉన్నాం. ఇంకా పనిచేయని వస్తువులు కూడా ఉన్నాయి. అంతరిక్ష వస్తువులు నిర్మూలించిన తర్వాత వాటిని పారవేసేందుకు లేదా తీసేయడానికి సాధ్యమైన చోటు కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. వాటిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకురావడం ముఖ్యం. ఇస్రో భవిష్యత్తులో ప్రయోగించే అన్ని వ్యోమనౌకల కోసం, అవి కక్ష్యలో ఉండేలా చర్యలు తీసుకుంటామని' వివరించారు. ఇదే సందర్భంలో 2035 నాటికి భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రం 'భారతీయ అంతరిక్ష స్టేషన్ 'ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని 'సోమనాథ్ పేర్కొన్నారు. అంతరిక్షంలో మానవ ఉనికిని కొనసాగించేందుకు ఈ ప్రాంతాన్ని రక్షించడం అవసరమని ఆయన తెలిపారు.


Next Story