విపరీతంగా కురుస్తున్న మంచు, వర్షం.. నదికి దూరంగా ఉండాలని హెచ్చరిక

by Disha Web Desk 17 |
విపరీతంగా కురుస్తున్న మంచు, వర్షం.. నదికి దూరంగా ఉండాలని హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు, మంచు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు, టూరిస్ట్‌లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం కూడా ఇలాంటి వాతావరణం ఉండటంతో అలెర్ట్‌గా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా లాహౌల్, స్పితిలో పోలీసులు చంద్ర నదికి దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంచు జారిపోయి నదిలో ప్రవాహనికి అడ్డుగా పేరుకుపోతుంది. మంచును తొలగిస్తుండటంతో నదిలో ప్రవాహం పెరుగుతుంది. దీంతో పరిసరాల ప్రజలు నది వద్దకు వెళ్ళవద్దని దూరంగా ఉండాలని అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే, మంచు కురుస్తున్న జిల్లాలో హిమపాతాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున మంచు ప్రాంతాల గుండా ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు కూడా జాగ్రత్త వహించాలని వారు కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులతో సహా 112 రహదారులను మూసివేశారు. వీటిలో 107 రోడ్లు గిరిజన లాహౌల్, స్పితి జిల్లాలో ఉన్నాయి. వాతావరణ కేంద్రం వెలువరించిన డేటా ప్రకారం, ఈ జిల్లాల్లో దాదాపు 2 నుంచి 5 సెం.మీ వరకు మంచు కురిసింది. ఏప్రిల్ 21 వరకు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


Next Story