అవి రెండూ ప్రమాదమంటే నేను ఒప్పుకోను: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

by Dishanational2 |
అవి రెండూ ప్రమాదమంటే నేను ఒప్పుకోను: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లౌకికవాదం, ప్రజాస్వామ్యం ఇవి రెండు ప్రమాదకరమైనవని ఎవరైనా చెబితే నేను ఒప్పుకోనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పడం కూడా సరైంది కాదన్నారు. ఓ మీడియా చానల్‌తో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజ్యాంగ వేత్తలు ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం పట్ల శ్రద్ధ వహించి ఎంతో అంకిత భావంతో రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. ప్రాథమిక హక్కులు, దేశ సార్వభౌమాధికారం మధ్య చక్కటి సమతుల్యత ఉందని తెలిపారు. ఇది దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో మాట్లాడే హక్కు లేకుండా పోతుందని, గట్టిగా వాదిస్తే వారి ఇంటికి ఈడీ వెళ్తుందని ఆరోపించారు. తాను రాజీవ్ గాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఎంతో మంది ప్రధానులతో కలిసి పని చేశానని, కానీ ఇంత మంచి ప్రధానిని ఎన్నడూ చూడలేదని మోడీని ఉద్దేశిస్తూ.. వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ కృషి మరువలేనిది

దేశంలో భిన్నత్వం, సంస్కృతి, భాష, మతం మధ్య ఏకత్వాన్ని తీసుకురావడానికి రాజ్యాంగం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. దేశ సంక్షేమానికి కొన్ని సార్లు రాజ్యాంగాన్ని సవరించారని తెలిపారు. కానీ ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్తో ఉన్నామన్నారు. భయంకరమైన వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఏ భాషలో మాట్లాడాలో చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ శాంతి యుతంగా జీవించే హక్కు ఉందని తెలిపారు.


Next Story

Most Viewed