భర్త అలా చేస్తే గృహ హింస కాదు : కోర్టు

by Dishanational4 |
భర్త అలా చేస్తే గృహ హింస కాదు : కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : భర్త స్థానంలో ఉన్న వ్యక్తి తన తల్లికి సమయాన్ని కేటాయించడం, డబ్బులివ్వడాన్ని గృహ హింసగా పరిగణించలేమని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ తన భర్త, అత్తింటి వారు గృహ హింసకు పాల్పడుతున్నారంటూ కోర్టును ఆశ్రయించింది. తల్లి మానసిక అనారోగ్యం విషయాన్ని దాచి.. భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తాను ఉద్యోగం చేయడాన్ని అత్త వ్యతిరేకించేదని పేర్కొంది. భర్త, అత్త కలిసి తనను వేధించారంటూ మేజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. తన భర్త 1993 సెప్టెంబర్ నుంచి 2004 డిసెంబరు వరకు విదేశాల్లో జాబ్ చేశాడని.. సెలవుపై భారత్‌కు వచ్చినప్పుడు తల్లిని కలిసేవాడని, ఆమెకు రూ.10,000 ఇచ్చేవాడని ఆ మహిళ ఆరోపించింది. తల్లికి కంటి ఆపరేషన్ కోసమూ డబ్బు ఖర్చు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద రక్షణ, ఉపశమనం, కల్పించడంతో పాటు పరిహారం ఇప్పించాలని మేజిస్ట్రేట్ కోర్టును కోరింది. ఇక భర్త కూడా తన వాదనను న్యాయస్థానానికి వినిపించాడు.

భర్త వాదన ఇదీ..

‘‘భార్య నన్ను భర్తగా ఎన్నడూ అంగీకరించలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేసేది.ఆమె క్రూరత్వం కారణంగా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ వేశాను. నాకు చెప్పకుండా నా ఎన్‌ఆర్‌ఈ అకౌంట్ నుంచి రూ. 21.68 లక్షలు విత్‌డ్రా చేసి ఫ్లాట్‌ కొనుగోలు చేసింది’’ అని మహిళ భర్త ఆరోపించాడు. ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న టైంలోనే మేజిస్ట్రేట్ కోర్టు సదరు మహిళకు నెలకు రూ.3వేల మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది. అయితే పూర్తి ఆధారాలను పరిశీలించిన తర్వాత గృహ హింస కింద ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. మధ్యంతర భరణాన్ని కూడా రద్దు చేసింది. దీంతో ఈ తీర్పును సదరు మహిళ ముంబై సెషన్స్ కోర్టులో సవాల్‌ చేసింది. విచారణ జరిపిన ఆ కోర్టు ఒక వ్యక్తి తన తల్లికి సమయం కేటాయించడాన్ని, డబ్బు ఇవ్వడాన్ని గృహ హింసగా పరిగణించబోమని పేర్కొంది. తగిన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.

Next Story

Most Viewed