రివర్ రాఫ్టింగ్ వంటి అడ్వెంచర్స్‌లో పాల్గొనే వారికి గరిష్ట వయస్సు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్

by Disha Web Desk 17 |
రివర్ రాఫ్టింగ్ వంటి అడ్వెంచర్స్‌లో పాల్గొనే వారికి గరిష్ట వయస్సు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని కయాకింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనే వ్యక్తులకు గరిష్ట వయోపరిమితిని పరిశీలించి, సిఫార్సు చేయాలని రాష్ట్ర హైకోర్టు కులు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించింది. అలాగే, సీనియర్ సిటిజన్లు ఇలాంటి సాహస కార్యకలాపాల్లో పాల్గొనే ముందు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జ్యోత్స్న రేవాల్ దువాతో కూడిన ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది.

2023 నవంబర్‌లో అడ్వెంచర్ స్పోర్ట్స్‌లలో, ప్రత్యేకంగా రివర్ రాఫ్టింగ్‌లో భద్రతా లోపాలు ఉండటాన్ని కోర్టు గుర్తించింది. రివర్ రాఫ్టింగ్ నిర్వాహకులు హిమాచల్ ప్రదేశ్ రివర్ రాఫ్టింగ్ రూల్స్, 2005లోని రూల్ 11(బి)ని ఉల్లంఘించారని ఎత్తిచూపింది. దీంతో కోర్టు కొత్తగా అడ్వెంచర్స్‌లో పాల్గొనే వారికి గరిష్ట వయస్సు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను తప్పినసరి చేసింది. ఈ నిబంధనలను అమలు చేయడానికి ఎలాంటి క్రియాశీల చర్యలు తీసుకున్నారు, గత రెండేళ్లలో ఈ నిబంధనలను పాటించనందుకు ఎంత మంది ఆపరేటర్లకు జరిమానా విధించారు తదితర వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని కోర్టు, డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించింది.

ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో 65 ఏళ్ల పర్యాటకుడు మరణించిన నేపథ్యంలో కోర్టు సీనియర్ సిటిజన్లు ఇలాంటి అడ్వెంచర్స్‌లో పాల్గొనే సమయంలో ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను అందించడం తప్పనిసరి చేసేలా చూడాలని పేర్కొంది. తదుపరి విచారణను కోర్టు జులై 18కి వాయిదా వేసింది.


Next Story

Most Viewed