సంక్షోభంలో హిమాచల్ ప్రభుత్వం: బీజేపీలో చేరిన రెబల్ ఎమ్మెల్యేలు

by Dishanational2 |
సంక్షోభంలో హిమాచల్ ప్రభుత్వం: బీజేపీలో చేరిన రెబల్ ఎమ్మెల్యేలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇటీవల అనర్హత వేటుకు గురైన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాకూర్ సమక్షంలో శనివారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన వారిలో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, రవి ఠాకూర్, చెతన్య శర్మ, రాజిందర్, దేవిందర్ కుమార్ భుట్టో, స్వత్రంత్ర ఎమ్మెల్యేలు ఆశిష్ శర్మ, హోషియార్ సింగ్, కేఎల్ ఠాకూర్ ఉన్నారు. వీరందరికీ ఉపఎన్నికల్లో ప్రస్తుతం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల నుంచి బీజేపీ టికెట్ కేటాయించింది. దీంతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా..బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. మెజారిటీకి 35 మంది సభ్యులు అవసరం కావాల్సి ఉంది.

అయితే ఇప్పటికే రాష్ట్రంలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో రాబోయే ఫలితాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే బీజేపీకి 31 మంది సభ్యులు అవుతారు. అలాగే ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రిజైన్ చేశారు. అయితే వీరి రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. ఒక వేళ స్పీకర్ ఆమోదం తెలిపితే మరో మూడు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు ఈ ఫలితాలపై ఆధారపడి ఉండనుంది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ తొమ్మిది స్థానాల్లో గెలిస్తే..34 మంది సభ్యులు అవుతారు. ఒక రెండు సీట్లు కాంగ్రెస్ గెలిచినా ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం ఉండదు.

కాగా, గత నెల చివరలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో తగినంత మెజారిటీ లేకపోయినప్పటికీ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ పఠానియా అనర్హత వేటు వేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. సీఎం సుఖూ అనుసరిస్తున్న విధానాల వల్లే అసంతృప్తికి గురైనట్టు రెబల్ ఎమ్మెల్యేలు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టులో తమ సభ్యత్వాన్ని కాపాడుకోవాలంటూ ఇచ్చిన పిటిషన్‌ను తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉపసంహరించుకోనున్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed