శంభూ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత: మరోసారి చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

by Dishanational2 |
శంభూ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత: మరోసారి చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ హర్యానా బార్డర్ శంభూ సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు బుధవారం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శంభూ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు రైతుల పైకి రెండు, మూడు రౌండ్ల పాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి రైతులు ప్రత్యేక మాస్క్‌లు, ఇయర్ బడ్స్ ధరించారు. సుమారు 14000 మంది రైతులు శంభూ బార్డర్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద 1200 ట్రాక్టర్లు, ట్రాలీలు ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. రైతులు ఢిల్లీలోకి రాకుండా విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని కేంద్ర ఏజెన్సీలు పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు, పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. రైతుల ముసుగులో కొందరు దుండగులు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

మరోసారి చర్చలకు ఆహ్వానం

ఢిల్లీ మార్చ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలోనే రైతులతో చర్చలకు మరోసారి కేంద్రం ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎంఎస్పీ, పంటల వైవిధ్యం, కేసుల విత్ డ్రా వంటి అన్ని అంశాలను ఐదో రౌండ్‌లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతు నాయకులను చర్చకు మరోసారి ఆహ్వానిస్తున్నాం. శాంతిని కాపడటమే ప్రభుత్వ లక్ష్యం’ అని పేర్కొన్నారు. అయితే మరోసారి చర్చలకు వెళ్తారా లేదా అనే విషయం రైతు సంఘాల నాయకులు వెల్లడించలేదు.ఒకవేళ రైతులు చర్చలకు అంగీకరిస్తే ఇది ఐదో సమావేశం కానుంది. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలన్నీ అసంపూర్తిగా ముగియగా..తదుపరి చర్చలపై ఉత్కంఠ నెలకొంది.



Next Story

Most Viewed