ఓట్ల క్రాస్ చెకింగ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

by Dishanational6 |
ఓట్ల క్రాస్ చెకింగ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: వీవీప్యాట్లను లెక్కించాలన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. తాము అరవైలలో ఉన్నామని.. బ్యాలెట్ పత్రాలు ఉన్నప్పుడు ఏం జరిగింతో తమకు తెలుసని అన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహా పలువురు వీవీప్యాట్లతో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలను సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్లు అన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సాధారణ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరపడంతో ఉన్న సమస్యలను ఎత్తి చూపింది..

ఈ పిటిషన్‌పై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ తరఫున సీనియర్‌ లాయర్ ప్రశాంత్‌భూషణ్‌ వాదనలు వినిపించారు. యూరప్ కంట్రీస్ లో ఎన్నికల ప్రక్రియ గురించి కోర్టుకు తెలిపారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి పేపర్ బ్యాలెట్లకే వచ్చాయని అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల ట్యాంపరింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నట్లు తెలిపారు. అందుకే పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరపాలని కోరారు. వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్ల చేతికి ఇవ్వాలని.. లేదా ఓటు వేశాక వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లే బ్యాలెట్ బాక్సుల్లో వేసేలా చూడాలని వాదనలు వినిపించారు.

దీనికి సుప్రీంకోర్టు బెంచ్ స్పందింస్తూ.. జర్మనీ జనాభా ఎంత? అని ప్రశ్నించగా.. 6కోట్ల మందని పిటిషనర్ జవాబిచ్చారు. కాగా.. మన దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య తొంభై ఏడు కోట్లని.. బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏమి జరిగిందో మనందరికీ తెలుసని జస్టిస్ ఖన్నా అన్నారు. అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు అడుగుతున్నారా అని ప్రశ్నించింది కోర్టు. తాము అరవైలలో ఉన్నామని.. బ్యాలెట్‌ పేపర్లు ఉన్నప్పుడు గతంలో ఏం జరిగిందో తమకు తెలుసని గుర్తుచేసింది ధర్మాసనం. బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదని తెలిపింది.

ధర్మాసనంలోని జస్టిన్‌ దీపాంకర్‌ దత్తా స్పందిస్తూ.. జర్మనీతో పోలిస్తే తన సొంత రాష్ట్రం బెంగాల్ జనాభా ఎక్కువ అని అన్నారు. దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించొద్దని కోరారు. ఈవీఎంల సెక్యూరిటీ, కౌంటింగ్ గురించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది కోర్టు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసేవారికి కఠిన శిక్షలు పడేలా చట్టం లేకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ అనే పెద్ద సమస్యని.. శిక్ష పడుతుందనే భయం ఉండాలని ఈసీకి వివరించింది కోర్టు. ఈకేసుపై విచారణను గురువారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.


Next Story