మహారాష్ట్ర ‘ఇండియా’ కూటమిలో విభేదాలు: ఉద్ధవ్ థాక్రేపై కాంగ్రెస్ ధ్వజం

by Dishanational2 |
మహారాష్ట్ర ‘ఇండియా’ కూటమిలో విభేదాలు: ఉద్ధవ్ థాక్రేపై కాంగ్రెస్ ధ్వజం
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య భిన్నస్వరాలు వినపడుతున్నాయి. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే శనివారం అమోల్ కీర్తికర్‌ను ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ స్పందిస్తూ ఉద్ధవ్ థాక్రేపై మండిపడ్డారు. సీట్ల పంపకంపై తుది నిర్ణయం వెలువడక ముందే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. ఇది కూటమి ధర్మాన్ని ఉల్లంఘించడం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను కించపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారా? అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉద్దవ్ ప్రకటించిన అభ్యర్థి ఒక పెద్ద మోసగాడని ఆరోపించారు. కొవిడ్ టైంలో పెద్ద స్కామ్ చేశాడని విమర్శించారు. దీంతో ఇండియా కూటమిలో పలు రాష్ట్రాల్లో సీట్ షేరింగ్ ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సంజయ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో ఇండియా బ్లాక్ నేతలకు షాక్ తగిలినట్టు అయింది.

పోటీ చేయడం మా హక్కు్: శివసేన(యూబీటీ)

సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యలపై శివసేన(యూబీటీ) పార్టీ స్పందించింది. సంజయ్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు తన పార్టీలో పోర్ట్‌ఫోలియో కూడా లేదు. బహుశా, ఇందుకోసమే ఆయన ఇండియా బ్లాక్ లేదా మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) సమావేశాలకు హాజరవడం లేదు. మేము ముంబై నార్త్-వెస్ట్ గెలిచినప్పుడు 2019లో ఆ స్థానంలో మళ్లీ పోటీ చేయడం మా హక్కు’ అని శివసేన (యూబీటీ) అధికార ప్రతినిధి ఆనంద్ దూబే తెలిపారు. సంజయ్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు చెప్పాలి కానీ..సోషల్ మీడియా వేదికలపై అర్ధం లేని వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.

8 సీట్లపై కుదరని ఏకాభిప్రాయం?

మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) వర్గం పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఇక్కడ సీట్ షేరింగ్ పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. రాష్ట్రంలోని మొత్తం 48లోక్ సభ స్థానాలకు గాను 8 సీట్ల విషయంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరనట్టు తెలుస్తోంది. ప్రధానంగా ముంబైలోని ఆరు సీట్లపై మాత్రం తీవ్ర కసరత్తు జరుగుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు మూడింటిలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోంది. కానీ ఈ ప్రతిపాదనకు శివసేన అంగీకరించనట్టు సమాచారం. అయితే త్వరలోనే మహారాష్ట్రలో సైతం సీట్ల పంపకాలపై తుది ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed