రెండో రోజూ కేజ్రీవాల్ ఇంటికి క్రైమ్ బ్రాంచ్: ఢిల్లీ సీఎం ఇంటి వద్ద హై టెన్షన్

by Dishanational2 |
రెండో రోజూ కేజ్రీవాల్ ఇంటికి క్రైమ్ బ్రాంచ్: ఢిల్లీ సీఎం ఇంటి వద్ద హై టెన్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బృందం వరుసగా రెండో రోజూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలపై కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే చాలా సేపు ఢిల్లీ పోలీసు టీమ్ సీఎం నివాసం బయటే వేచి ఉన్నారు. నోటీసులు తీసుకోవడానికి సీఎం కార్యాలయం సిద్ధంగా ఉందని, కానీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నేరుగా కేజ్రీవాల్ కే అందజేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆప్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని, అంతేగాక కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొడతామని తమను బెదిరించారని ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సచ్‌దేవా నేతృత్వంలోని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం నగర పోలీస్ చీఫ్‌ సంజయ్ అరోరాని కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సాక్ష్యం ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. దీనిపై అయన వాంగ్మూలాన్ని సైతం తీసుకోనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే క్రైమ్ బ్రాంచ్ బృందం శుక్రవారమే సీఎం కేజ్రీవాల్, మంత్రి అతిశీల నివాసానికి వెళ్లింది. కానీ ఇరువురూ ఇళ్లలో లేకపోవడంతో పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు.

కేజ్రీవాల్‌పై బీజేపీ ఆగ్రహం

మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను ఐదోసారి తిరస్కరించడంపై బీజేపీ నేత హరీశ్ ఖురానా కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పదే పదే సమన్లు దాటవేస్తే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ తరహా చర్యలు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరుకాకపోవడం సరికాదని తెలిపారు. ‘కేజ్రీవాల్ ఐదో సారి ఈడీ సమన్లను పక్కనబెట్టారు. ఆయన చట్టాన్ని గౌరవించడం లేదు. అనేక ప్రశ్నలకు ఢిల్లీ సీఎం సమాధానం చెప్పాల్సి ఉంది. సమన్లు చట్ట విరుద్ధమైతే..కోర్టును ఆశ్రయించి ఎందుకు రద్దు చేయడం లేదు’ అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed