నితీశ్‌ను కాంగ్రెస్ పదే పదే అవమానించింది: జేడీయూ నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
నితీశ్‌ను కాంగ్రెస్ పదే పదే అవమానించింది: జేడీయూ నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో అధికారంలో ఉన్న మహాఘట్‌బంధన్ నుంచి నితీశ్ వైదొలగుతున్నారనే వార్తల నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) అధికార ప్రతినిధి కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కాంగ్రెస్ పదే పదే అవమాస్తోందని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి పతనం అంచున ఉందన్నారు. పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్‌లలో కూటమి దాదాపుగా ముగిసినట్టేనని స్పష్టం చేశారు. కూటమిలో ప్రధాన స్థానం కోసం నితీశ్ కుమార్ ఎప్పుడూ ఆశపడలేదని.. కానీ కాంగ్రెస్ నాయకత్వంలోని ఓ వర్గం ఆయనను పదే పదే అవమానించిందని చెప్పారు. ప్రతిపక్షాలను ఐక్యం చేయడంతో నితీశ్ విజయం సాధించారని కానీ, పలు పార్టీల ఉద్దేశం అస్పష్టంగా ఉందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ, నాయకత్వం, ఎజెండాపై ఇండియా కూటమిలో ఉమ్మడి సమావేశం జరగకపోవడం బాధాకరమన్నారు. బిహార్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో త్యాగి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

నితీశ్, లాలూ కూటమి విచ్ఛిన్నం!

బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ల కూటమి దాదాపుగా విచ్ఛిన్నమైనట్టు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 10గంటలకు నితీశ్ తన రాజీనామాను గవర్నర్‌కు అందజేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఎమ్మెల్యేల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేయనున్నట్టు తెలిపాయి. ఇద్దరు డిప్యూటీ సీఎంలతో పాటు నితీశ్‌ ప్రమాణస్వీకారం చేస్తారని పేర్కొన్నాయి. అయితే ఆర్జేడీ, జేడీయూలు గానీ ఈ కథనాలపై అధికారికంగా స్పందించలేదు. మరోవైపు రాజకీయ పరిణామాల మధ్య బిహార్‌లో కాంగ్రెస్ సమన్వయకర్తగా భూపేశ్ బఘేల్‌ను నియమించారు.

Next Story