ఇద్దరు మంత్రుల ఫ్యామిలీలకు చెరో టికెట్.. కాంగ్రెస్‌ మూడో లిస్ట్

by Dishanational4 |
ఇద్దరు మంత్రుల ఫ్యామిలీలకు చెరో టికెట్.. కాంగ్రెస్‌ మూడో లిస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ 57 మంది లోక్‌సభ అభ్యర్థులతో మూడో జాబితాను గురువారం రాత్రి విడుదల చేసింది. వీటిలో తెలంగాణలోని 5 స్థానాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలు, పుదుచ్చేరిలోని 1 స్థానం, రాజస్థాన్‌లోని 6 స్థానాలు, మహారాష్ట్రలోని 7 స్థానాలు, కర్ణాటకలోని 17 స్థానాలు, గుజరాత్‌లోని 11 స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని 2 స్థానాలు ఉన్నాయి. కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డికి బెంగళూరు సౌత్ లోక్‌సభ టికెట్‌ను కేటాయించారు. కర్ణాటక ఉద్యానవన శాఖ మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున్ భార్య ప్రభా మల్లికార్జున్‌కు దవణగెరె లోక్‌సభ టికెట్‌ను ఇచ్చారు. కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నాయకులు అధిర్ రంజన్ చౌదరికి ఆయన సిట్టింగ్ స్థానం బహరంపూర్‌ నుంచి మళ్లీ అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు జాబితాల్లో దేశవ్యాప్తంగా 139 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. తాజాగా రిలీజ్ చేసిన మూడో జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి దానం నాగేందర్‌, చేవెళ్ల నుంచి రంజిత్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేశారు. కాగా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.



Next Story