హస్తం పార్టీ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఫైర్..

by Disha Web Desk 13 |
హస్తం పార్టీ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఫైర్..
X

బెంగళూరు: బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. "కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు రాముడికి తాళం వేశారు. ఇప్పుడు జై బజరంగ్ బలి అని నినాదాలు చేసేవాళ్లకు తాళం వేస్తామని శపథం చేశారు" అని హోస్పేట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని వ్యాఖ్యానించారు. “నేను హనుమంతుని భూమి కర్ణాటకకు నివాళులర్పించడానికి వచ్చిన తరుణంలో.. బజరంగ్ బలికి తాళం వేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. హనుమంతుని పాదాల వద్ద నా శిరస్సు వంచి ప్రతిజ్ఞ చేస్తున్నా.. కర్ణాటక గౌరవం, సంస్కృతిని ఎవ్వరూ దెబ్బతీయనివ్వను" ” అని మోదీ పేర్కొన్నారు.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్ణాటకను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు రోడ్‌మ్యాప్ ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వ్యారంటీని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని.. వ్యారంటీ లేకుండా ఇచ్ఛే ఎన్నికల హామీ అబద్ధం తప్ప మరొకటి కాదని ప్రధాని అన్నారు. "కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో మీరు చూశారు. గతంలో రాష్ట్రాన్ని ఉగ్రవాదుల దయా దాక్షిణ్యాలకు ఆ పార్టీ ఎలా వదిలిపెట్టిందో మీకు తెలుసు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదుల వెన్ను విరిచి, బుజ్జగింపు ఆటను బీజేపీ ముగించింది" అని ఆయన తెలిపారు. ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, ఉగ్రవాదుల మరణవార్త విని ఒక కాంగ్రెస్ అగ్రనేత కళ్లలో నీళ్లు తిరిగాయని మోడీ చెప్పారు. కాంగ్రెస్, జేడీ (ఎస్)లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించిన మోడీ.. ఆ పార్టీలు కర్ణాటకలో పెట్టుబడులను ఎప్పటికీ పెంచలేవని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేవన్నారు.

Next Story