కోర్టులో సొంతంగా వాదనలు వినిపించుకున్న CM కేజ్రీవాల్.. ఈడీపై సంచలన ఆరోపణలు

by Disha Web Desk 19 |
కోర్టులో సొంతంగా వాదనలు వినిపించుకున్న CM కేజ్రీవాల్.. ఈడీపై సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ వారం రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఆయనను గురువారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. కేజ్రీవాల్‌ను మరో 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ఆప్ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. కస్టడీలో ఆయన స్టేట్‌మెంట్ మొత్తం రికార్డ్ చేశామని, తప్పించుకునేలా సమాధానాలు చెప్తున్నారని ఈడీ తరఫు లాయర్లు వాదించారు.

మరోవైపు తన అరెస్ట్, రిమాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ సొంతంగా వాదనలు వినిపించారు. తనను ఈ కేసులో ఇరికించడమే ఈడీ లక్ష్యమని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ 31 వేల పేజీలు, ఈడీ 25 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశాయి.. కానీ అందులో ఎక్కడ కూడా నా పేరు లేదని తెలిపారు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 స్టేట్‌మెంట్లలో ఆరు స్టే్ట్‌మెంట్లలో నా పేరు లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 100 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు చెప్తున్నారు.. మరీ ఆ రూ.100 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్‌ చంద్రా రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రూ.55 కోట్లు బీజేపీకి డొనేషన్ ఇచ్చాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈడీకి రెండు లక్ష్యాలు ఉన్నాయని.. ఒకటి ఈ కేసులో కేజ్రీవాల్‌ను ఇరికించడం, రెండవది ఆప్ పార్టీని లేకుండా చేయడమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎటువంటి కేసు లేదని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ కస్టడీపై తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Next Story

Most Viewed