రాజనీతికి కాదు.. రాష్ట్రనీతికే మా ప్రాధాన్యత : ప్రధాని మోడీ

by Dishanational4 |
రాజనీతికి కాదు.. రాష్ట్రనీతికే మా ప్రాధాన్యత : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : తాము తలుచుకుంటే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేవాళ్లమని.. దేశపు విశ్వాసానికి విఘాతం కలగకూడదనే ఏకైక ఉద్దేశంతో ఆనాడు వైట్ పేపర్ రిలీజ్ చేయలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అప్పట్లో ‘రాజనీతి’ని పక్కన పెట్టి ‘రాష్ట్రనీతి’కే తాము ప్రయారిటీ ఇచ్చామని తెలిపారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. 2014కు ముందు యూపీఏ సర్కారు దేశాన్ని దివాలా దిశగా నడిపిన తీరును అద్దంపట్టే వివరాలతో ఇటీవలే పార్లమెంటులో వైట్ పేపర్‌ను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశమే ఉండి ఉంటే.. పదేళ్ల క్రితమే వైట్ పేపర్‌ను విడుదల చేసి ఉండేవాళ్లమని చెప్పారు. ‘‘గత పదేళ్లలో మేం చాలా బలోపేతం అయ్యాం. ఇప్పుడు మేం ఎలాంటి దాడినైనా తట్టుకోగలం. అందుకే ఇక ప్రజలకు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాం. వెంటనే పార్లమెంటులో శ్వేతపత్రం విడుదల చేశాం’’ అని ప్రధాని తెలిపారు. వైట్ పేపర్‌ను నిశితంగా అధ్యయనం చేస్తే యూపీఏ పాలనకు, ఎన్డీఏ పాలనకు గల తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు.



Next Story

Most Viewed