ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం

by Gopi |
ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని మరో నెల పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి మనోజ్ పాండే ఈ నెల 31న సర్వీసుల నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంది. తాజా పొడిగింపుతో జూన్ 30 వరకు ఆయన ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. పదవీకాలం పొడిగింపునకు సంబంధించి కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. గతంలోనూ కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. 2022, ఏప్రిల్ 30న మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కార్న్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ స్థాయికి ఎంపికైన తొలి వ్యక్తి మనోజ్ పాండే కావడం విశేషం. 1962, మే 6న జన్మించిన పాండే రెండేళ్ల పాటు 29వ ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. 1982లో కార్న్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో ఆయన చేరారు. 41 ఏళ్ల వృత్తి జీవితంలో ఆయన అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. పశ్చిమ ప్రాంతంలో ఇంజనీర్‌ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు, లదాఖ్‌ సెక్టార్లో మౌంటేన్‌ డివిజన్‌కు నేతృత్వం వహించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్ర దాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లోని పల్లన్‌వాలా సెక్టార్లో ఆపరేషన్‌ పరాక్రమ్‌ సందర్భంగా ఇంజనీర్‌ రెజిమెంట్‌కు నేతృత్వం వహించారు.

Next Story

Most Viewed