జైల్లో ఉండి సీఎంగా కొనసాగొచ్చా? చట్టం ఏం చెబుతోంది?.. తొలి సీఎంగా కేజ్రీవాల్ రికార్డ్

by Dishanational5 |
జైల్లో ఉండి సీఎంగా కొనసాగొచ్చా? చట్టం ఏం చెబుతోంది?.. తొలి సీఎంగా కేజ్రీవాల్ రికార్డ్
X

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ, ఆయన జైలు నుంచే తన బాధ్యతలను నిర్వర్తిస్తారని మంత్రి అతిషి వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ నేతలు సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం అతిషి మాట్లాడుతూ, ‘‘జైల్లో ఉన్నా సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారు. మొదటి నుంచీ ఆయన చెబుతున్నది అదే. అందులో రెండో ఆలోచన లేదు. జైలు నుంచి సీఎంగా పనిచేసే విషయంలో కేజ్రీవాల్‌ను ఏ చట్టమూ ఆపలేదు. లిక్కర్ స్కాంలో ఆయన ఇంకా దోషిగా తేలలేదు’’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అసలు జైల్లో ఉండి సీఎంగా కొనసాగవచ్చా? చట్టం ఏం చెబుతున్నది అనేది తెలుసుకుందాం.

దోషిగా తేలితేనే..

చట్టం ప్రకారం, ఒక కేసులో దోషిగా తేలితేనే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబడతారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 నిర్దిష్ట నేరాలకు అనర్హత నిబంధనలను కలిగి ఉంది. అయితే, ఆ పదవిలో ఉన్న ఎవరైనా దోషిగా నిర్ధారణ అయినప్పుడే అనర్హతకు గురవుతారు. ముఖ్యమంత్రిని రెండు పరిస్థితులలో పదవి నుండి తొలగించవచ్చని, అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు లేదా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విజయవంతమైనప్పుడు సీఎంను తొలగించవచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ఇంకా దోషిగా తేలలేదు. పైన పేర్కొన్న రెండు సందర్భాలు సైతం ప్రస్తుతం వర్తించవు. కాబట్టి, జైల్లో ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ పదవికి చట్టపరమైన ఇబ్బందేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో అరెస్టయిన తొలి సీఎం

స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగా అరెస్టయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఈ ఏడాది ప్రారంభంలో భూ కుంభకోణం కేసులో అరెస్టయ్యే ముందు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, 1997లో దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో, అరెస్టు కాకముందే సీఎం పదవి నుంచి వైదొలిగారు. అయితే, కేజ్రీవాల్ మాత్రం పదవిలో ఉండగానే అరెస్టయ్యారు.

కేజ్రీవాల్ రాజీనామా చేయాలి: బీజేపీ డిమాండ్

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్.. తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ముఖ్యమంత్రిని ఎట్టకేలకు అరెస్టు చేయడంతో ఢిల్లీలోని ప్రతి పౌరుడు సంతృప్తి చెందాడు. కేజ్రీవాల్ అరెస్టు అవినీతిపై విజయం. ఆయన తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి’’ అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా డిమాండ్ చేశారు.




Next Story

Most Viewed