బిగ్ బ్రేకింగ్ : మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి

by Disha Web Desk 4 |
బిగ్ బ్రేకింగ్ : మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : పంజాబ్‌లోని సైనిక శిభిరంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. భటిండా మిలటరీ స్టేషన్‌లో బుధవారం తెల్లవారుజామున 4.35 గంటలకు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భటిండా మిలటరీ స్టేషన్ లోపల కాల్పులు జరిగిన విషయాన్ని అధికారులు ధృవీకరించారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టినట్టుగా ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ప్రకటించింది.

ఈ ఘటన సైనిక స్థావరంలోని శతఘ్ని యూనిట్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఇది జరిగినట్లు భావిస్తున్నారు. మృతులను అధికారులు గుర్తించారు. ఆ ప్రదేశంలోనే సైనికుల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. సివిల్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పోలీసులను లోపలికి అనుమతించలేదని బఠిండా సీనియర్‌ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్పీ) ఖురానా వెల్లడించారు. కాల్పుల ఘటనలో ఉగ్రకోణం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, కొందరు ఆర్మీ సిబ్బంది హస్తం ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా, కాల్పుల ఘటనతో కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed