బీజేపీ-బీజేడీ పొత్తుకు బ్రేక్: ఒంటరిగానే బరిలోకి ఇరు పార్టీలు!

by Dishanational2 |
బీజేపీ-బీజేడీ పొత్తుకు బ్రేక్: ఒంటరిగానే బరిలోకి ఇరు పార్టీలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో బీజేపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ)ల మధ్య సీట్ షేరింగ్ విషయంలో జరిగిన చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఒడిశాకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ బీజేడీతో పొత్తుపై ఎలాంటి చర్చ జరగలేదని, బీజేపీ సొంతంగానే పోటీ చేస్తుందని తెలిపారు. సీట్ల పంపకాలపై చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ నేతలతో చర్చించేందుకు రాజధానికి వెళ్లిన బీజేడీ కీలక నేతలు వీకే పాండియన్, ప్రణబ్ ప్రకాశ్ దాస్‌లు కూడా సీట్ షేరింగ్ పై స్పందించలేదు. దీంతో పొత్తుకు ఇరు పార్టీలు అంగీకరించినా సీట్ల పంపకం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో పొత్తు బ్రేక్ పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీట్ల పంపకంపై కుదరని సయోధ్య

ఒడిశాలో పొత్తు పెట్టుకుంటున్నట్టు మొదట ఇరు పార్టీలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే బీజేపీ-బీజేడీ నేతలు సీట్ల పంపకం విషయంపై చర్చించేందుకు భేటీ అయ్యారు. కానీ 147 మంది సభ్యులున్న ఒడిశా అసెంబ్లీలో 100 సీట్లకు పైగా పోటీ చేయాలని బీజేడీ భావించగా.. ఈ ప్రతిపాదనకు బీజేపీ నో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనికి బదులుగా 21 స్థానాలున్న లోక్ సభ సీట్లలో 14 సెగ్మెంట్లలో పోటీ చేస్తామని బీజేపీ తెలపగా అందుకు బీజేడీ తిరస్కరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పొత్తుపై ప్రతిష్టంబన ఏర్పడింది. బీజేడీ ఆమోదయోగ్యం కాని 75 శాతం అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీకి 114మంది ఎమ్మెల్యేలున్నారు.

2009 వరకూ మిత్రపక్షాలే

బీజేపీ, బీజేడీలు 1998 నుంచి 2009 వరకు మిత్ర పక్షాలు గానే ఉన్నాయి. 11 సంవత్సరాల పాటు పొత్తు పెట్టుకుని మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అయితే 2009లోనూ సీట్ షేరింగ్‌పై భిన్నాభిప్రాయాలు రావడంతో పొత్తుకు బ్రేక్ పడింది. అనంతరం జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేడీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. దీంతో తాజాగా ప్రధాన నరేంద్ర మోడీ ఒడిశా పర్యటన అనంతరం పొత్తు పెట్టుకోవాలని రెండు పార్టీలు భావించినా..సీట్ షేరింగ్ విషయంలో ప్రతిష్టంబన ఏర్పడటంతో పొత్తుకు బ్రేక్ పడింది.

Next Story

Most Viewed