బీజేపీ ఎత్తు.. వరుణ్ గాంధీ పైఎత్తు..!!

by Dishanational4 |
బీజేపీ ఎత్తు.. వరుణ్ గాంధీ పైఎత్తు..!!
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని హాట్ సీట్లలో పిలిభిత్ ఒకటి. ఈ కీలకమైన స్థానం నుంచి 2019 ఎన్నికల వరకు వరుసగా మూడుసార్లు బీజేపీ నేత వరుణ్‌గాంధీ గెలుస్తూ వచ్చారు. మరోసారి పార్టీ అవకాశమిస్తే తాను తప్పకుండా గెలుస్తాననే ధీమాలో ఆయన ఉన్నారు. అయితే వరుణ్ గాంధీకి పిలిభిత్ టికెట్ కేటాయింపుపై ఇప్పటిదాకా బీజేపీ అధినాయకత్వం నుంచి పాజిటివ్ సిగ్నలేదీ అందలేదు. దీంతో ఏం జరుగుతుందో అనే దానిపై డైలమా నెలకొంది. ఒకవేళ కమలదళం టికెట్ ఇచ్చేందుకు నో చెబితే.. పిలిభిత్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు వరుణ్ గాంధీ రెడీ అవుతున్నారట. ఇందుకోసం ఇప్పటికే నాలుగు సెట్ల నామినేషన్ పేపర్లను కూడా ఆయన రెడీ చేసుకున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వరుణ్‌కు సమాజ్‌వాదీ టికెట్ ?

ఈ పరిణామాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇస్తుందో లేదో నాకెలా తెలుస్తుంది. ఆయనకు టికెట్ ఇవ్వాలా వద్దా అనే దానిపై మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఆయన తెలిపారు. వరుణ్‌కు పిలిభిత్ టికెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అఖిలేష్ చెప్పకనే చెప్పారు. ఇప్పటివరకు పిలిభిత్ స్థానానికి సమాజ్ వాదీ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఈ స్థానంలో రాజకీయాలు ఏ క్షణంలో ఎలాంటి మలుపు తిరుగుతాయో ఊహించడం కష్టతరంగా మారింది. 2023 సెప్టెంబరులో వరుణ్ గాంధీ ఫ్యామిలీ నిర్వహించే అమేథీలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి లైసెన్స్‌ను యోగి ఆదిత్యనాథ్ సర్కారు రద్దు చేసింది. దీనిపై అప్పట్లో వరుణ్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆస్పత్రి పేరులోని ‘గాంధీ’ అనే పదాన్ని చూసి సీఎం యోగి టార్గెట్‌గా ఎంచుకున్నారని విమర్శించారు. నాటి నుంచి సీఎం యోగికి, వరుణ్ గాంధీకి మధ్య గ్యాప్ పెరిగింది.

Next Story