ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్లు.. కాంగ్రెస్‌‌కు ఎంతంటే..?

by Dishanational5 |
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్లు.. కాంగ్రెస్‌‌కు ఎంతంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి విరాళాలు పోటెత్తాయి. నేరుగా వచ్చిన విరాళాలు గతేడాది డిసెంబర్‌లో ప్రకటించగా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి(ఈసీ) సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం రూ.2,120 కోట్ల విరాళాలు రాగా, అందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే రూ.1300 కోట్లు(61శాతం) రావడం విశేషం. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పోలిస్తే ఏడు రెట్లు అధికం కావడం గమనార్హం. 2021-22లో వచ్చిన రూ.1,775కోట్ల విరాళాలతో పోలిస్తే, మరుసటి ఏడాది దాదాపు రూ.345కోట్లు అధికంగా వచ్చాయి. మొత్తంగా గతేడాది బీజేపీకి రూ.2,360కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఆదాయంలో విరాళాలతోపాటు వడ్డీల ద్వారా అదనంగా రూ.237కోట్లు చేకూరాయి. వీటిలోంచి ఎన్నికల సమయంలో విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి 78.2 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు ఆర్థికసాయం కింద రూ.76.5కోట్లు అందజేసింది. మరోవైపు, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఇదే సమయంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కేవలం రూ.171కోట్లు మాత్రమే రావడం గమనార్హం. మరో రూ.79.92కోట్ల విరాళాలు నేరుగా పొందింది. ఇక, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల్లో సమాజ్‌వాది పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2కోట్లు పొందగా, టీడీపీకి రూ.34కోట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలకూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు రాలేదు.

ఎలక్టోరల్ బాండ్లు అంటే..

ఎలక్టోరల్ బాండ్ల పథకం 2017లో ఫైనాన్స్ బిల్లు ద్వారా ప్రవేశపెట్టగా, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా దాతలు(వ్యక్తులు/సంస్థలు) తమ వివరాలు బహిరంగ పర్చకుండానే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్ల విలువ రూ.వెయ్యి నుంచి రూ.కోటి వరకు ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయి, గత లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లను సాధించిన పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందేందుకు అర్హులు.




Next Story

Most Viewed