షేక్ షాజహాన్ ను అరెస్టు చేయాల్సిందే.. బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

by Dishanational6 |
షేక్ షాజహాన్ ను అరెస్టు చేయాల్సిందే.. బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సందేశ్ ఖలీ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్ ను అరెస్టు చేసి తీరాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడిన ఆరోపణల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు టీఎంసీ నేత షేక్ షాజహాన్. ఈ కేసులో షాజహాన్ ను అరెస్టు చేయొద్దని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.

సందేశ్‌ఖలీ వ్యవహారంలో షాజహాన్ అరెస్టుపై కోర్టు స్టే విధించినందునే ఏమీ చేయలేకపోతున్నామని కథనాలు వెలువడ్డాయి. కాగా.. అరెస్టుపై ఎలాంటి స్టే విధించలేదని బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపింది. కాగా.. షాజహాన్ ను అరెస్టు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. షేక్ షాజహాన్ పై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు పేపర్లలో పబ్లిక్ నోటీసు జారీ చేయాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు సందేశ్ ఖలీ ఘటనపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదులు అందాయని.. అవి 42 ఛార్జిషీటులుగా మారేందుకు నాలుగేళ్లు పట్టడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది హైకోర్టు. సందేశ్ ఖలీలో సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఈకేసులో తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా పడింది.

ఈనెల ప్రారంభంలో షేక్ షాజహాన్, అతని మద్దతుదారులు.. లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడ్డారని మహిళలు ఆరోపించారు. దీంతో సందేశ్ ఖలీలో నిరసన చెలరేగింది. జనవరి 5న ఈడీ అధికారులు షాజహాన్ నివాసాలపై దాడికి పాల్పడ్డారు. అప్పట్నుంచి షాజహాన్ అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపు టీఎంసీ నేత షాజహాన్, అతని సహచరులకు వ్యతిరేకంగా 50 ఫిర్యాదులు అందాయని షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ తెలిపింది. ఈవ్యవహారంలో మొత్తం 1250 ఫిర్యాదులు రాగా.. అందులో 400 భూ సమస్యలకు సంబంధించినవని తెలిపారు బెంగాల్ అధికారులు.


Next Story

Most Viewed