క్రీడా రంగంలోకి ఆర్మీ.. బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు రెండు కంపెనీలు

by Dishanational4 |
క్రీడా రంగంలోకి ఆర్మీ.. బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు రెండు కంపెనీలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని పూణె, మధ్యప్రదేశ్‌లోని మోవ్‌ నగరాల్లో రెండు బాలికల స్పోర్ట్స్ ట్రైనింగ్ కంపెనీలను భారత ఆర్మీ ఏర్పాటు చేయనుంది. పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక కంపెనీ, మోవ్‌లోని ఆర్మీ మార్క్స్‌మన్‌షిప్ యూనిట్‌లో మరో కంపెనీ ఏప్రిల్ నాటికి ఏర్పాటవుతాయి. మహిళా సాధికారతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీలను ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ కంపెనీలలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన బాలికలకు షూటింగ్, విలువిద్య, అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లలో ట్రైనింగ్ ఇస్తారు. వారిని సంబంధిత క్రీడా విభాగాల్లో ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దడమే ఈ కంపెనీల ప్రధాన లక్ష్యమని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ రెండు కంపెనీలలో ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణా మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్, వసతి సౌకర్యం, కోచింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ట్రైనింగ్ పొందే యువతులు అగ్నివీర్ ఉద్యోగానికి అర్హులు అవుతారు. దీంతో పాటు డైరెక్ట్ ఎంట్రీ నాన్ కమీషన్డ్ ఆఫీసర్స్, డైరెక్ట్ ఎంట్రీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్‌గా కూడా ఆర్మీలో జాబ్ ఆఫర్స్‌కు అర్హతను సాధిస్తారు. ఈ రెండు కంపెనీలలో ట్రైనింగ్ పొందుతున్న సీనియర్ ఆర్మీ జట్లు, అథ్లెట్ల సలహాలతో బాలికలు ఎన్నో కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారు.

ఒక సక్సెస్ స్టోరీ ఇదీ..

ట్రాప్ షూటింగ్ విభాగంలో ఛాంపియన్‌గా పేరొందిన హవల్దార్ ప్రీతి రజక్ ఈ ఏడాది జనవరిలోనే సుబేదార్ ర్యాంక్‌కు పదోన్నతి పొందారు. భారత సైన్యంలో ఆ ర్యాంక్‌ సాధించిన మొదటి మహిళగా ఆమే. ప్రీతి రజక్ కెరీర్‌కు బీజాలు పడింది కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌ విభాగంలోనే. 2022 డిసెంబర్‌లో ఆ సంస్థలో చేరి తన క్రీడా నైపుణ్యాలను రజక్ పెంచుకున్నారు. షూటింగ్ విభాగంలో రాణించడంతో ఆమెకు తొలుత ఆర్మీలో హవల్దార్‌గా జాబ్ వచ్చింది. 2022లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో ట్రాప్ మహిళల టీమ్ ఈవెంట్‌లో రజక్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఆమె ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ కోసం మోవ్‌లోని ఎలైట్ ఆర్మీ మార్క్స్‌మన్‌షిప్ యూనిట్‌లో శిక్షణ పొందుతున్నారు.

Next Story

Most Viewed