ఇరాన్‌పై దాడి ఖాయం..యుద్ధ విమానాలను సిద్ధం చేస్తున్న ఇజ్రాయెల్!

by Dishanational2 |
ఇరాన్‌పై దాడి ఖాయం..యుద్ధ విమానాలను సిద్ధం చేస్తున్న ఇజ్రాయెల్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని, బలమైన దాడి చేయాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు యుద్ధ విమానాలను సైతం సిద్ధం చేస్తున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ కేబినెట్ ఏర్పాటు చేసిన రెండు సమావేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ఇరాన్‌పై దాడికి అమెరికా తయారు చేసిన ఎఫ్-16, ఎఫ్-15, ఎఫ్-35 ఫైటర్ జెట్లను ఉపయోగించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే దాడి ఎప్పుడు చేస్తారనే వివరాలు వెల్లడించలేదు. మరోవైపు నెవాటిమ్ ఎయిర్ బేస్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ హర్జీ హలేవి ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దీంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర మిత్రదేశాలు సూచించినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. మరోవైపు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే ఇజ్రాయెల్ పై ఘోరమైన దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అత్యంత అధునాతన ఆయుధాలను వాడుతామని హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం మరింత ముదరక ముందే సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి.


Next Story