'పాల సేకరణ ఆపమని అమూల్‌కు చెప్పండి'.. అమిత్ షాకు ముఖ్యమంత్రి లేఖ

by Disha Web Desk 13 |
పాల సేకరణ ఆపమని అమూల్‌కు చెప్పండి.. అమిత్ షాకు ముఖ్యమంత్రి లేఖ
X

చెన్నై: తమిళనాడులో పాల సేకరణ వెంటనే ఆపాల్సిందిగా గుజరాత్‌కు చెందిన డెయిరీ బెహెమోత్ అమూల్‌ను ఆదేశించాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. అమూల్ అని పిలవబడే కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ చేస్తున్న పాల సేకరణ వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులపై స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అమిత్ షాకు లేఖ రాశారు. తమిళనాడు కొ-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఆవిన్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. స్టాలిన్ చెబుతున్న దాని ప్రకారం.. కృష్ణగిరి జిల్లాలో చిల్లింగ్ సెంటర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు అమూల్ తన బహుళ రాష్ట్ర సహకార లైసెన్స్‌ను ఉపయోగిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది.

రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు), స్వయం సహాయక బృందాల ద్వారా తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, వెల్లూరు, రాణిపేట, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పాలను సేకరించాలని అమూల్ భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఒకరి పాల ఉత్పత్తి ప్రాంతాలను మరొకరు ఆక్రమించుకోకుండా.. సహకార సంఘాలు అభివృద్ధి చెందేలా చూడాలని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. అమూల్ చర్యల వల్ల పాలు, పాల ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌లో సహకార సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాలలో డెయిరీ అభివృద్ధికి ప్రాంతీయ సహకార సంఘాలు మూల స్థంభాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ఇష్టమొచ్చినట్టు ధరలు పెంచకుడా నిరోధించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. తమిళనాడులోని అవిన్ డెయిరీ ఉత్పత్తి ప్రాంతం నుంచి పాల సేకరణను నిలిపివేయాల్సిందిగా వెంటనే అమూల్‌ను ఆదేశించండి’ అని స్టాలిన్ తన లేఖలో రాశారు.

Next Story

Most Viewed