అమేథీ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ భర్త..!

by Dishanational6 |
అమేథీ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ భర్త..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని.. సరైన సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని రాబర్ట్ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ని సందర్శించి, లార్డ్ బాంకే బిహారీని దర్శనం చేసుకున్న తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఠాకూర్ జీ 'శృంగార్ ఆరతి'ని చూసి.. అది అయోధ్య అయినా.. మధుర అయినా.. ప్రతి ప్రదేశాన్ని ఒకే విధంగా చూస్తానని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఊహాగానాలకు తెరదించుతూ వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటివరకు అమెథీలో పోటీచేయనున్న అభ్యర్థి పేరుని ఖరారు చేయలేదు.

రాబర్ట్ వాద్రా విలేకరులతో మాట్లాడుతూ.. తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని, దేశం మార్పు కోరుకుంటుందని అన్నారు. తన కుటుంబం మొత్తం దీనిపై శ్రద్ధగా పని చేస్తుందని తెలిపారు. తాను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా, పాల్గొనలేకపోయినా.. దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూనే ఉంటామని వాద్రా చెప్పారు.

అమేథీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలనే ప్రశ్నపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ప్రజల బాధలు అర్థం చేసుకున్నానని.. తమకు ప్రాతినిధ్యం వహించాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని.. ప్రస్తుతం తొందరపడటం లేదని స్పష్టం చేశారు. వాద్రావెంట యూపీ కాంగ్రెస్ నేత ప్రదీప్ మాథుర్ ఉన్నారు.

బీజేపీ 'వివక్ష రాజకీయాలు' చేస్తున్న పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్‌ను సనాతన్ వ్యతిరేకి అని అనడం బీజేపీ పబ్లిసిటీ మాత్రమే అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, కూటమిని గెలిపించేందుకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా కష్టపడుతున్నారని చెప్పారు. దేశంలో సంతోషం, శాంతి నెలకొనాలని బాంకే బిహారీకి ప్రార్థించానని అన్నారు. రాహుల్, ప్రియాంక ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.

అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. ప్రియాంక గాంధీ సోదరుడు రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. దీనిపైనా అధికారిక ప్రకటన వెలువడలేదు. 2019లో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా బీజేపీ స్మృతి ఇరానీనే మళ్లీ పోటీకి దింపింది.


Next Story