పోలీసులకు ధోతీ,కుర్తా డ్రెస్ కోడ్‌తో వివాదంలో యూపీ ప్రభుత్వం

by Dishanational1 |
పోలీసులకు ధోతీ,కుర్తా డ్రెస్ కోడ్‌తో వివాదంలో యూపీ ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: వారణాసిలోని ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ, కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో పూజారులుగా మారిపోయారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తా ధరించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర వివాదానికి దారి తీయడమే కాకుండా రాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 'పోలీసులను పూజారుల తరహాలో డ్రెస్ కోడ్ ధరించవచ్చని ఏ పోలీస్ మాన్యూవల్‌లో ఉంది? ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చిన వారిని తక్షణ సస్పెండ్ చేయాలని, దీన్ని భవిష్యత్తులో అవకాశంగా మార్చుకుని మోసాలకు పాల్పడితే, ప్రజలను దోపిడీ చేస్తే యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?' అని ప్రశ్నించారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, దీనిపై కమిషనర్ మోహిత్ అగర్వాల్ స్పందిస్తూ.. ఈ ఆలయంలో విధి నిర్వహణ ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. పోలీసులు రద్దీ సమయంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు వ్యవహరించే విధానం ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి పోలీస్ సిబ్బంది పూజారుల రూపంలో కనిపిస్తే ప్రజలు కొంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ కారణంతోనే డ్రెస్ కోడ్ మార్చినట్టు వివరించారు.



Next Story

Most Viewed