వాజ్‌పేయి పాత్రలో పంకజ్.. ఈసీ ‘నేషనల్ ఐకాన్’ పదవికి రాజీనామా

by Dishanational4 |
వాజ్‌పేయి పాత్రలో పంకజ్.. ఈసీ ‘నేషనల్ ఐకాన్’ పదవికి రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత ఎన్నికల సంఘం ‘నేషనల్ ఐకాన్’ పదవికి నటుడు పంకజ్ త్రిపాఠి రాజీనామా చేశారు. ఎన్నికల సంఘం ‘నేషనల్ ఐకాన్’ పదవిలో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలనే నిబంధన ఉంది. అయితే రాజకీయ నాయకుడి పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించిన ఒక సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. దీంతో భారత ఎన్నికల సంఘం ‘నేషనల్ ఐకాన్’ పదవికి పంకజ్ త్రిపాఠి స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించారని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. 2022 అక్టోబరు నుంచి ఓటరు అవగాహన పెంచేందుకు ఆయన అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది.

మై అటల్ హూ..

జనవరి 19న రిలీజ్ కాబోతున్న పంకజ్ త్రిపాఠి సినిమా పేరు.. ‘‘మై అటల్ హూ’’. ఇది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్. ఇందులో వాజ్‌పేయి పాత్రను త్రిపాఠి పోషిస్తున్నారు. ప్రజల మనసులు గెల్చుకున్న గ్రేట్ లెజెండ్ అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో నటించే అవకాశం దక్కడం తన లక్ అని పంకజ్ త్రిపాఠి అంటున్నారు. కాలేజీలో రోజుల్లో తాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో పనిచేశానని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ బాట కఠినంగా అనిపించి.. దారిని మార్చుకొని సినిమాల వైపునకు మళ్లానని ఆయన చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందని పంకజ్ పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చారు. ‘‘ మా సొంత రాష్ట్రం బిహార్‌లో అందరూ రాజకీయ నాయకులే’’ అని పేర్కొన్నారు.



Next Story

Most Viewed