భోపాల్ TO ఇండోర్.. కిడ్నీని తరలించడానికి 200 కి.మీ గ్రీన్ కారిడార్

by Disha Web Desk 17 |
భోపాల్ TO ఇండోర్.. కిడ్నీని తరలించడానికి 200 కి.మీ గ్రీన్ కారిడార్
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన కిడ్నీని తరలించేందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి ఇండోర్ మధ్య దాదాపు 200 కిలోమీటర్ల మేర గ్రీన్ కారిడార్‌ను అధికారులు మంగళవారం ఏర్పాటు చేశారు. సాగర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హరిశంకర్ ధిమోలే (56) మెదడులో రక్తస్రావంతో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స అందించే సమయంలో పరిస్థితి విషమించి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దీంతో అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు.

ధిమోలే రెండు కిడ్నీలలో ఒకదానిని బన్సాల్ హాస్పిటల్‌లో నిరుపేద రోగికి అమర్చారు. అయితే మరో కిడ్నీని ఇండోర్‌లోని చోయిత్రమ్ హాస్పిటల్‌లోని ఒక రోగికి అమర్చాల్సి ఉంది. ఈ మధ్య దూరం 200 కి.మీ ఉంటుంది. దీంతో పోలీసులు, అధికారుల సహాయంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి కిడ్నీని భోపాల్ నుండి ఇండోర్‌కు కేవలం రెండు గంటల 45 నిమిషాల్లో తరలించారు. మామూలుగా అయితే ఈ దూరానికి దాదాపు 4 గంటల వరకు సమయం పడుతుంది. అవయవ దాత హరిశంకర్ ధిమోలే కుమారుడు హిమాన్షు మాట్లాడుతూ, "మా నాన్నగారి అవయవ దానం ఇద్దరు రోగులకు కొత్త జీవితాన్ని అందించింది. ఇది మా కుటుంబానికి గర్వకారణం. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేము" అని అన్నారు.


Next Story

Most Viewed