రేపే ‘రెండో దశ’ ఎన్నికల సమరం.. టాప్ పాయింట్స్ ఇవే

by Dishanational4 |
రేపే ‘రెండో దశ’ ఎన్నికల సమరం.. టాప్ పాయింట్స్ ఇవే
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్‌ శుక్రవారం జరగనుంది. 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 88 లోక్‌సభ స్థానాల్లో దాదాపు 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించు కోనున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ఘట్టం జరగనుంది. ఈ ఓట్ల పండుగను నిర్వహించడంలో 16 లక్షల మంది పోలింగ్ అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు. పోలింగ్ వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలు ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్‌ జరగనుంది. అక్కడ మొత్తం 194మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. రెండో విడత పోలింగ్‌తో కేరళ, రాజస్థాన్‌, త్రిపురలో ఎన్నికలు పూర్తవుతాయి. కర్ణాటకలోని 14, రాజస్థాన్‌‌లోని 13, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌‌లలోని చెరో 8, , మధ్యప్రదేశ్‌లోని 6, అసోం, బిహార్‌‌లలో చెరో ఐదు, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌‌లలోని చెరో మూడు, మణిపూ‌ర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌‌లలోని ఒక్కోస్థానానికి ఈ విడతలో ఓటింగ్‌ జరగనుంది. కాగా, శుక్రవారం పోలింగ్‌ జరగనున్న 88 లోక్‌సభ స్థానాల్లో 2019లో ఎన్డీయే కూటమి 56 సీట్లు, ఇండియా కూటమి (యూపీఏ) 24 సీట్లు గెల్చుకున్నాయి.

మొత్తం 1202 మంది అభ్యర్థులు

రెండో విడత పోలింగ్‌లో ఓటు వేయనున్న 15.88 కోట్ల మంది ఓటర్లలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళలు, 5929 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. 34.8 లక్షల మంది మొదటిసారిగా ఓటు వేయనున్నారు. 20-29 సంవత్సరాలలోపు వయసు కలిగిన ఓటర్లు 3.28 కోట్ల మంది ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 1202 మంది అభ్యర్థుల్లో పురుషులు 1098 మంది, మహిళలు 102 మంది, థర్డ్ జెండర్ ఇద్దరు ఉన్నారు. రెండో విడత ఓటర్లలో 85 ఏళ్లకు పైబడినవారు 14.78 లక్షల మంది, 100 ఏళ్లకు పైబడినవారు 42,226 మంది, దివ్యాంగ ఓటర్లు 14.7 లక్షల మంది ఉన్నారు. వీరికి ఇళ్ల వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. రెండోవిడతలో మొత్తం 251 మంది ఎన్నికల పరిశీలకులు విధులు నిర్వర్తిస్తారు.

కేరళలో ట్రయాంగిల్ ఫైట్

కేరళలో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్, సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరుగుతోంది. కేరళలో 2.77కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 5 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 25,231 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 66వేలకుపైగా భద్రతాదళాలను మోహరించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి 19 లోక్‌సభ స్థానాలు గెలవగా, సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ కూటమి ఒక్క స్థానానికే పరిమితమైంది.

రాజస్థాన్‌లో కీలక అభ్యర్థులు

తొలి విడతలోనే రాజస్థాన్‌లోని 12 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మిగతా 13 స్థానాలకు ఈ విడతలో ఓటింగ్‌ జరగనుంది. 152 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కేంద్రమంత్రులు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ తదితరులు ఉన్నారు.

కర్ణాటకలోని 14 స్థానాల్లో 247 మంది పోటీ

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వాటిలో 14 స్థానాలకు శుక్రవారం ఓటింగ్‌ జరగబోతోంది. వీటిలో 247 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ 14 చోట్ల పోటీ చేస్తుండగా, బీజేపీ 11, ఎన్డీఏ భాగస్వామి జేడీఎస్‌ 3 స్థానాల్లో బరిలో ఉంది. ఈ విడతలో 2.88కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననుండగా.. వారి కోసం 30,602 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 14 స్థానాలకుగాను బీజేపీ 11 చోట్ల, ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలిచారు. అప్పట్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ చెరో లోక్‌సభ స్థానంలో నెగ్గాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు ఉంది.

వాతావరణ శాఖ హెచ్చరిక

రెండో విడత పోలింగ్ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల్లో బెంగాల్, ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తర్​​ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని ఐఎండీ చెప్పింది. బెంగాల్​, ఒడిశాకు రెడ్ వార్నింగ్, బిహార్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. త్రిపుర, కేరళ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, మేఘాలయ, గోవాలో అధిక తేమ కారణంగా ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండలు ఎక్కువగా ఉన్నందున బిహార్‌లోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని ఈసీ పొడిగించబడింది.



Next Story

Most Viewed