ఆంక్షల్లేవ్.. యాసంగిలో వరిసాగుపై కేంద్ర మంత్రి క్లారిటీ

by  |
ఆంక్షల్లేవ్.. యాసంగిలో వరిసాగుపై కేంద్ర మంత్రి క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న యాసంగి సీజన్‌లో తెలంగాణలో వరి సాగు చేయవద్దంటూ ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆదేశాలను కూడా జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యాసంగిలో పంటల సాగుపై కేంద్రం నిబంధనలు విధించినట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పైవిధంగా బదులిచ్చారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ తరపున ఇప్పటివరకు తెలంగాణకు యాసంగి సాగు విషయంలో వరి పంటకు సంబంధించిన ఎలాంటి ఆంక్షలు, నిబంధనల గురించి చెప్పలేదన్నారు.

రానున్న యాసంగి సీజన్‌లో బాయిల్డ్ రైస్ కొనేది లేదంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో వరి సాగు వద్దని రాష్ట ప్రభుత్వం రైతాంగానికి పిలుపునిచ్చింది. పంటల మార్పిడి వైపు రైతుల్ని మళ్ళించాల్సిందిగా కేంద్రం కూడా సూచన చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిమంది రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు యాసంగికి వరి సాగు వద్దంటూ కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని కామెంట్ చేయడంతో కేంద్ర మంత్రి రాతపూర్వకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరణ ఇచ్చారు.

Next Story