సీల్డ్ కవర్లలో మేయర్, చైర్మన్ల పేర్లు

by  |
Warangal
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల జరిగిన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆయా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో గతం కంటే తక్కువ స్థానాలను గెలుచుకుంది. కొన్నింటిలో టీఆర్ఎస్ రెబల్స్ ఇతర పార్టీల నుంచి, కొందరు స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించారు.

ముందస్తుగా ప్రకటిస్తే అసంతృప్తులు తిరుగుబావుట ఎగురవేసే అవకాశం ఉందని భావించిన అధిష్టానం సీల్డు కవర్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల జాబితాను ఉంచారు. ఈనెల 7న శుక్రవారం మేయర్, చైర్మన్ల ఎన్నిక జరుగనుండగా టీఆర్ఎస్ పార్టీ పరిశీలకులను నియమించింది. ఆ జాబితాను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు.

వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఖమ్మంకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి, కొత్తూరు మున్సిపాలిటీకి పరిశీలకుడిగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, నకిరేకల్‌కు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సిద్దిపేటకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అచ్చంపేటకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్చర్ల మున్సిపాలిటీ పరిశీలకుడిగా సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియామకం అయ్యారు.

వీరందరిని గురువారం సాయంత్రం కార్పొరేషన్, మున్సిపాలిటీ లకు చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఎన్నికల అబ్జర్వర్లు ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. సీల్డు కవర్లలోని పేర్లతో రెండు కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యుటీ మేయర్లు, ఐదు మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను క్రమశిక్షణతో ఎన్నుకోవాలని ఆదేశించారు.

Next Story

Most Viewed