TRS​ పాలన కంటే నక్సలైట్లే నయం : శ్రవణ్

by  |
TRS​ పాలన కంటే నక్సలైట్లే నయం : శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీఆర్​ఎస్​ పాలనను చూశాక నక్సలైట్ల తీరే కరెక్ట్ అనిపిస్తుందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ అన్నారు. గతంలో గ్రామాల్లో బూటకపు ఎన్నికలను బహిష్కరించాలనే నినాదాలు ఉండేవని, గోడలపై రాతలు రాసేవారని, ఇప్పుడు టీఆర్​ఎస్​ ఎన్నికల్లో ప్రవర్తిస్తున్న తీరుతో అదే నిజమనిపిస్తుందన్నారు. గాంధీభవన్​లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్​ఎస్​ పార్టీ గ్రేటర్​ ఎన్నికల్లో అవలంభిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్నికలు వద్దనేలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏండ్ల కింద నక్సలైట్లు చెప్పిన విధానాన్ని ఇప్పుడు టీఆర్​ఎస్​ పాలన, ఎన్నికల్లో అవలంభిస్తున్న విధానాలను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. గ్రేటర్​ ఎన్నికల్లో గులాబీ నాయకుల తీరును చూస్తుంటే ఎన్నికల్లో పోటీ చేయడమే దండగ అనేలా ఉందని దాసోజు శ్రవణ్​ మండిపడ్డారు. గాంధీభవన్​లో సోమవారం మీడియాతో మాట్లాడారు.

టీఆర్​ఎస్​ నేతలు అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్మును గ్రేటర్​ ఎన్నికల్లో బయటకు తీస్తున్నారని, ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్​ ఎన్నికల కోసం టీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని, ఓటర్లు వారిని అడ్డుకుని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా పలు వీడియోలను చూపించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టి ఎన్నికలను నిర్వహిస్తుందని, పోలీసులు, ఎన్నికల సంఘం కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని శ్రవణ్​ దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం బానిసలా మారిందని, ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తున్న అధికార పార్టీని ఇంకా ఎంకరేజ్​ చేసేలా అధికారులు ఉన్నారన్నారు. ఇలా అవినీతి సొమ్మును ప్రజలకు పంచి వారిని నిందించే బదులుగా ఎన్నికలను రద్దు చేయాలని, నేరుగా కార్పొరేటర్ల సీట్లను అమ్ముకోవాలని, ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉంటే వారే కొనుక్కుంటారని ఎద్దేవాచేశారు. టీఆర్​ఎస్​ డబ్బులు పంచుతుంటే పోలీసులు వారికి రక్షణగా నిలుస్తున్నారని, కాంగ్రెస్​ కార్యకర్తలు, ఓటర్లే పోలీసుల డ్యూటీ చేయాల్సి వస్తుందని శ్రవణ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధికి పట్టం కట్టండి : మధుయాష్కి

గ్రేటర్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు మద్దతు తెలపాలని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందని, ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించుకుని ఓటేయాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ తీర్చలేదన్నారు. హైదరాబాద్‌ను పూర్తి నిర్లక్ష్యం చేసిన కారు పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పూర్తిగా అధికార పార్టీ‌కి అటెండర్‌గా మారిందన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఇచ్చిన హామీలకే దిక్కులేదని, కొత్తగా హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతీ డివిజన్‌కు రూ.5 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇవి గ్రేటర్ అభివృద్ధికి ఖర్చుపెడితే బాగుండేదని మధుయాష్కి మండిపడ్డారు.



Next Story

Most Viewed